YS Sharmila - New Partyదివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఉన్నఫళంగా హైదరాబాద్ లో వైఎస్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం అంటూ పెట్టారు. “తెలంగాణ లో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని నా కోరిక, రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని నా నమ్మకం,” అంటూ తెలంగాణ లో పార్టీ పెట్టనున్నట్టు ఆమె ప్రకటించారు.

అన్న తో విభేదించి ఆమె పార్టీ పెడుతున్నారు అని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అన్నతో విభేదిస్తే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ తెలంగాణలో పెట్టడం ఏంటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లు బీజేపీ వైపు వెళ్తున్నారు. షర్మిల పార్టీ పెడితే రెడ్డి, క్రిస్టియన్ ఓటర్లు కాంగ్రెస్ నుండి బీజేపీ వైపు కాకుండా షర్మిల వైపు వెళ్లినా అది తెరాసకు ప్లస్ అవుతుంది.

తనకు సన్నిహితుడైన కేసీఆర్ ని కాపాడటానికి షర్మిల పార్టీ జగన్ వదిలిన బాణమా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ని కాపాడటానికి జగన్ ట్రై చేస్తే బీజేపీ ఊరుకుంటుందా? ఇక తెలంగాణలో షర్మిల పార్టీకి తమకు సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. అన్నాచెల్లల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి గానీ విబేధాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి.

ఒక కుటుంబం మధ్య భేదభిప్రాయాలు ఉన్నాయని చెప్పినా అది రాజకీయంగా ఇబ్బందే. ఆంధ్రప్రదేశ్… తెలంగాణల మధ్య చాలా వివాదస్పద అంశాలు ఉంటాయి. ఆయా సందర్భంగా ఒక్కోసారి అన్నాచెల్లలు ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం కూడా రావొచ్చు. ఆ రకంగా ఇది జగన్ పై బాణం కూడా కావొచ్చు.