YS-Sharmila-Meets-DK-Shivakumarఏపీలో ఆడపడుచులందరికీ అన్నగా, వారి పిల్లలకి మేనమావనని చెప్పుకొంటున్న సిఎం జగన్మోహన్ రెడ్డి, సొంత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, చిన్నాన్న కూతురు సునీతారెడ్డిలని దూరం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నతో విభేదించి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకొన్న వైఎస్ షర్మిల, ఎంతకీ మంట రాజుకోకపోవడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఆమె బెంగళూరు వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డికె శివ కుమార్‌తో భేటీ అయ్యారు. వారి కుటుంబంతో తనకు చాలా కాలంగా స్నేహసంబంధాలు ఉన్నందునే ఆయనను అభినందించేందుకు వెళ్ళానని వైఎస్ షర్మిల సర్దిచెప్పుకొన్నారు.

అయితే ఆమె తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు, లేదా ఆ పార్టీతో పొత్తుల కోసం చర్చించేందుకే బెంగళూరు వెళ్ళారనే ఊహాగానాలు వినిపించగా ఆమె వాటిని ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదంటూ తీసిపడేశారు. అంతటితో ఆ కధ ముగిసిపోయిందనుకొంటే, ఆమె మళ్ళీ ఇవాళ్ళ ఉదయం బెంగళూరు వెళ్ళి డికె శివకుమార్‌తోనే మళ్ళీ భేటీ అయ్యారు! బహుశః ఈసారి ఆయన నీటిపారుదల శాఖామంత్రిగా నియమితులైనందున మళ్ళీ అభినందించడానికే వెళ్ళానని వైఎస్ షర్మిల చెప్తారేమో?

కానీ ప్రియాంకా గాంధీ సూచన మేరకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి లేదా పొత్తుల కోసమే ఆమె బెంగళూరు వెళ్ళి ఉండవచ్చనే ఊహాగానాలకు ఆమె పర్యటనలు బలం చేకూరుస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం లేదా పొత్తుల కోసమే అయితే, ఆమె హైదరాబాద్‌లోనే ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలిసి మాట్లాడాలి కానీ కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె శివకుమార్‌తో భేటీలు ఎందుకు?అంటే ‘ఏపీ కాంగ్రెస్‌ కోసమని’ మరో సమాధానం వినిపిస్తోంది.

ఏపీ విభజన వలన, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను చీల్చి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకోవడం వలన ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వైఎస్ షర్మిల కూడా తన రాజకీయ భవిష్యత్‌ కోసం తెలంగాణలో నిలబడి నలుదిక్కులు చూస్తున్నారు. కనుక ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొని జగనన్నపైకి బాణం సందించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో విలీనం, పొత్తులపై వచ్చిన ఊహాగానాలను ఆమె ఖండిస్తున్నారు కానీ దీనిని ఖండించడం లేదు. అంటే ఆ ఊహాగానాలలో ఎంతో కొంత నిజముందని భావించవచ్చు.

లేదా ఏపీలో వైసీపీ పరిస్థితి దిగజారుతున్నందున సిఎం జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబ స్నేహితుడైన డికె శివకుమార్‌ ద్వారా వైఎస్ షర్మిలతో రాయబారం చేస్తున్నారేమో?ఆమెను మళ్ళీ వెనక్కు రప్పించి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కనుక వైఎస్ షర్మిల బెంగళూరు పర్యటనలను పూలబొకేలు పంచేందుకు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. బహుశః త్వరలోనే దీనిపై స్పష్టత రావచ్చు.