YS-Sharmila-KCR-Jaganవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత మూడు నెలలుగా ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లాలో ఆమె ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “సిఎం కేసీఆర్‌ ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కారు. పంట రుణాల మాఫీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, వృద్ధాప్య పింఛనులు, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన ఎన్నికల హామీలన్నిటినీ విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నాడు.

ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచేసి తనకు మళ్ళీ అధికారం కట్టబెట్టిన ప్రజలపైనే భారం వేస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే నేను వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని స్థాపించాను. మా పార్టీ అధికారంలోకి రాగానే ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన అన్ని పధకాలను తెలంగాణలో మళ్ళీ ప్రారంభిస్తాను,” అని అన్నారు.

ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వం తమకు ఏవైనా సంక్షేమ పధకాలు ప్రకటించాలని కోరుకొనేవారు. కానీ ఇప్పుడు ఏపీలో ప్రజలు సంక్షేమ పధకాలను, వాటి కోసం ప్రభుత్వం చేస్తున్న అప్పులను, పెంచుతున్న ఛార్జీలను చూసి భయపడుతున్నారు.

నిన్న జూలై 1వ తేదీ నుంచే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో భారీగా టికెట్‌ ఛార్జీలు పెంచేసింది. ఇక్కడ ఏపీలో బస్ ఛార్జీలు పెంచినప్పుడే అక్కడ తెలంగాణలో వైఎస్ షర్మిల ఛార్జీలు పెంచడాన్ని తప్పు పడుతూ మాట్లాడటం కాకతాళీయమే కానీ వినడానికి చాలా విడ్డూరంగా ఉంది.

సిఎం కేసీఆర్‌ ఎన్నికల హామీలు అమలుచేయలేదని ఆమె ప్రశ్నించడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచేసి తనకు మళ్ళీ అధికారం కట్టబెట్టిన ప్రజలపైనే భారం వేస్తున్నాడని వైఎస్ షర్మిల తెలంగాణ సిఎం కేసీఆర్‌ను విమర్శించడమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే, ఆమె అన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు కదా?

“కనుక ముందు ఏపీకి వెళ్ళి మీ అన్నగారిని నిలదీయండి,” అని టిఆర్ఎస్‌ నేతలు ఎవరైనా అంటే ఆమె ఏమి సమాధానం చెప్పగలరు? వైఎస్ షర్మిల తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొంటుంటారు. మరి పుట్టింట్లో ప్రజలు పెరిగిన ఛార్జీల భారం భరించలేక బాధలు పడుతున్నప్పుడు ఆమె వచ్చి ఇక్కడి ప్రజల తరపున తన అన్నను నిలదీయవచ్చు కదా?

ఇక ఏపీలో వైఎస్సార్ పేరుతో ఆమె అన్నగారు స్థాపించిన సంక్షేమ రాజ్యం పరిస్థితి ఏవిదంగా ఉందో చూస్తున్న తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం కూడా ఏపీలాగ మారాలని కోరుకోరనే సంగతి ఆమెకు తెలియదనుకోగలమా?