ys-sharmila-comments-on-kcr-own-flightవైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ (జి) గ్రామంలో పాదయాత్ర కెఃశారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “సిఎం కేసీఆర్‌ దళిత బంధు పేరుతో మరోసారి రాష్ట్రంలో దళితులను మోసం చేయాలని చూస్తున్నారు. దళిత బంధు పధకం టిఆర్ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే ఇస్తారా?అటువంటప్పుడు ‘టిఆర్ఎస్‌ అనుచర బంధు’ అని ఆ పధకం పేరు మార్చుకొంటే బాగుంటుంది కదా?దళిత బంధు పధకం ఇవ్వాలని ఎవరైనా అడిగితే, ఇస్తే ఇవ్వాలి లేకుంటే ఇవ్వలేమని చెప్పేయాలి అంతేకానీ పధకం అడిగితే వారిపై కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పడం దేనికి?ఆయనకు అధికార మదం పూర్తిగా తలకెక్కిపోయింది. అందుకే దళితులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.

కేసీఆర్‌ రాష్ట్రంలో దళితులతో అందరినీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంటారు. అందుకే ఆయన అందరినీ తన మాయమాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఆయనకు నిజంగా దళితులంటే ఎటువంటి ప్రేమ లేదు. ఉన్నట్లయితే తక్షణం దళితులపై నమోదు చేసిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన రాష్ట్రాన్ని, దళితుల భూములను దోచుకొని అక్రమంగా కోట్లు సంపాదించుకొంటూ సొంత విమానం కొనుక్కొంటున్నారు కానీ ఈ ఏడేళ్ళ సిఎం కేసీఆర్‌ పాలనలో దళితుల జీవితాలలో ఏవైనా మార్పు వచ్చిందా?అని నేను అడుగుతున్నాను. కనుక ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలే ఎన్నికలలో తగినవిదంగా బుద్ధి చెప్పాలని కోరుతున్నాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.

సిఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కనుక టిఆర్ఎస్‌ను ఎన్నికలలో ఓడించి ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని వైఎస్ షర్మిల ప్రజలను కోరుతున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నికలతో ఆమెకు ఆ అవకాశం వచ్చినప్పుడు తమ పార్టీ అభ్యర్ధిని బరిలో దించకుండా పరోక్షంగా టిఆర్ఎస్‌కు సహకరిస్తున్నారు. ఒకవేళ ఆమెకు చిత్తశుద్ధి ఉండి ఉంటే మునుగోడు ఉపఎన్నికలలో తప్పకుండా అభ్యర్ధిని నిలబెట్టి టిఆర్ఎస్‌ను ఓడించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా? ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు, మునుగోడు ఉపఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకంజ వేసిన ఆమె తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుదామని కలలు కంటుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?