YS-Sharmila-Comments-on-BRS-Partyతన సోదరుడితో విభేదించి తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నా ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఆమెను, ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీని పట్టించుకొనే నాధుడే లేడు. ఒకవేళ ఆమె చెప్పుకొంటున్నట్లు తనకు బ్రహ్మాండమైన ప్రజాధారణ లభిస్తున్నట్లయితే పార్టీ అభ్యర్ధిని మునుగోడు ఉపఎన్నికల బరిలో దించి గెలిపించుకొని తన సత్తా చాటుకోవచ్చు కదా? తెలంగాణలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదు కనుకనే ఆమె ఢిల్లీ వెళ్ళి తెలంగాణ సిఎం కేసీఆర్‌, కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతికి పాల్పడిందని నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేసి అందరి దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేశారు.

మళ్ళీ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఆమె అవే ఆరోపణలు పునరుద్గాటిస్తూ, “దేశంలో అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు. దానిని అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మంత్రులు ఇష్టం వచ్చిన్నట్లు దోచుకు తిన్నారు. ఈ విషయం రాష్ట్ర బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు కూడా పదేపదే ప్రస్తావిస్తుంటారు కానీ కేసీఆర్‌ ప్రభుత్వంపై ఎటువంటి చర్యలు తీసుకోరు. కేవలం రాజకీయ విమర్శల కోసం దానిని వాడుకొంటారు అంతే! కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పటికీ ఎందుకు సీబీఐ చేత విచారణ జరిపించడం లేదు?అంటే ఆ రెండు పార్టీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే.

రాష్ట్రంలో ఇంత భారీ అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ ఇప్పుడు బిఆర్ఎస్‌ అంటూ జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడేందుకు బయలుదేరుతున్నారు. బిఆర్ఎస్‌ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి.

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ వీధి కుక్కలా కాట్లాడుకొంటున్నాయి. వాటి తీరు చూస్తే అవి ఉపఎన్నికలు కావు వీధి కుక్కల కొట్లాట అని అనిపించకమానదు. టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ సంతలో పశువులను కొనుకొన్నట్లు నేతలను కొనుక్కొంటున్నాయి. దేశంలోకెల్ల అత్యంత ఖరీదైన ఉపఎన్నికలు మునుగోడులో జరుగుతున్నాయి,” అని ఆక్షేపించారు.

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలు వీధి కుక్కలా కాట్లాడుకొంటున్నాయని ఆక్షేపిస్తున్న వైఎస్ షర్మిల వాటిలో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉపఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. కోమటిరెడ్డి సోదరులు తన తండ్రికి చాలా సన్నిహితులు కనుక ఈ ఉపఎన్నికలకు దూరంగా ఉండిపోవాలని వైఎస్ షర్మిల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అంటే ఆమె కూడా పరోక్షంగా బిజెపికి మద్దతు ఇస్తూ, మళ్ళీ బిజెపిని కూడా విమర్శిస్తుండటం రాజకీయమే కదా?