YS-Sharmila-Chanchalguda-Central-Jailవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం హైదరాబాద్‌లో పోలీసులపై దాడిచేసినందుకు నాంపల్లి కోర్టు ఆమెకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించింది. పోలీసులు ఆమెను చంచల్‌గూడా జైలుకి తరలించారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా నిన్న రాత్రి చంచల్‌గూడ జైలులో అడుగుపెట్టారు. ఏడాదిగా తెలంగాణలో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసినా రాని గుర్తింపు, మీడియా ఫోకస్ నిన్న జరిగిన ఘటనలతో వచ్చింది. ఇప్పుడు చంచల్‌గూడ జైలుకు కూడా వెళ్ళారు కనుక రాజకీయాలలో ప్రాధమిక అర్హత కూడా వచ్చింది.

ఆమె బెయిల్‌ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. ఈ విచారణ ఎంత ఎక్కువ రోజులు సాగితే అంతా ఆమెకు మీడియా కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ ఆమెకు నేడు బెయిల్‌ లభిస్తే ఈ ఘటనలపై ఆమె తెలంగాణ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించవచ్చు. కనుక పోలీసులు ఆమెను మళ్ళీ అడ్డుకొనే ప్రయత్నం చేస్తే మళ్ళీ వారితో తోపులాటల డ్రామా ఉండవచ్చు. మళ్ళీ మరో కేసు నమోదు చేసినా చేయవచ్చు.

వర్తమాన రాజకీయాలలో నేతలపై ఎన్ని పోలీస్ కేసులు నమోదైతే రాజకీయంగా అంతగా ఎదిగిన్నట్లు భావిస్తుంటారు. కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు ఎందుకు చేస్తున్నారనే దానిపై అనేక అనుమానాలు, అపోహలు ఉన్నందున ఈ కేసులు, అరెస్టులు ఆమెకు, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

ఏపీకి చెందిన ఆమె తన అన్నతో విభేధించి తెలంగాణకు వచ్చారని అధికార బిఆర్ఎస్ వాదిస్తోంది. తెలంగాణ ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఆమె ఈవిదంగా తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ కేసీఆర్‌కు తోడ్పడేందుకే వచ్చారని కాంగ్రెస్‌, బిజెపిలు అనుమానిస్తున్నాయి. తెలంగాణలో ఆమె చేస్తున్న రాజకీయాలతో ఇటు ఏపీలో జగనన్నకి, అటు తెలంగాణలో కేసీఆర్‌కి ఇద్దరికీ పరోక్షంగా తోడ్పడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కనుక ఇటువంటి ప్రశ్నార్ధకమైన రాజకీయాలు చేస్తున్న కారణంగా వైఎస్ షర్మిలపై ఇంకా ఎన్ని పోలీస్ కేసులు నమోదైనా, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళివచ్చినా రాజకీయంగా ఆమె ఎదుగుదల కష్టమే అని భావించవచ్చు.

వైఎస్ షర్మిల అరెస్ట్‌పై ఇంతవరకు ఏపీలో వైసీపీ నేతలు ఎవరూ నోరు విప్పలేదు. ఆమె చంచల్‌గూడ జైలుకి తరలించిన వార్త వైసీపీ ఆత్మసాక్షిలో ఇంకా రాలేదు. బహుశః ఈ ఘటనలపై ఏవిదంగా స్పందించాలి?ఎవరు దీనిపై మాట్లాడాలని వైసీపీలో చర్చించుకొంటున్నారేమో?