YS-Sharmila-CBI-Complaint-on-KCR-Kalesshwaram-Projectసిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేయడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ కుటుంబం వేలకోట్ల అవినీతికి పాల్పడిందని, కనుక దర్యాప్తు చేయాలని ఆమె సీబీఐని కోరారు.

రాజకీయాలలో బలమైన కారణం లేకుండా ఏదీ జరుగదని అందరికీ తెలుసు. ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తూ నిత్యం సిఎం కేసీఆర్‌ని విమర్శిస్తూ, ఆయన ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూనే ఉన్నారు. అదే… బిజెపి, కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తే వారిపై మూకుమ్మడిగా ఎదురుదాడి చేసే టిఆర్ఎస్‌ నేతలు, ఆమె తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే విమర్శిస్తున్నా పల్లెత్తుమాట అనలేదు! ప్రతిపక్షాలు నిరసన తెలియజేయాలనుకొంటే వారిని ఇంటి గడప దాటనీయకుండా అడ్డుకొనే తెలంగాణ పోలీసులు, కేసీఆర్‌ను ఆమె విమర్శిస్తున్నా ఏనాడూ ఆమె పాదయాత్రను అడ్డుకోలేదు! అంటే ఆమె వలన టిఆర్ఎస్‌కు రాజకీయంగా ఏదో లాభం ఉందని అనుమానించక తప్పదు. బహుశః ఆమె మాటలతో కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌కు కలిగే అప్రదిష్ట కంటే ప్రజలలో సానుభూతి, తెలంగాణ సెంటిమెంట్ రగులుతుందని భావిస్తున్నారేమో?

నవంబర్‌ 3వ తేదీన నల్గొండ జిల్లాలోని మునుగోడు శాసనసభకు ఉపఎన్నిక జరుగబోతోంది. హుజురాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి చేతిలో టిఆర్ఎస్‌ ఓటమి తర్వాత జరుగబోతున్న ఈ ఉపఎన్నికను టిఆర్ఎస్‌, బిజెపి రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడబోతున్నాయి. ఆమె ఈ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా తమ పార్టీ పోటీ నుంచి విరమించుకొన్నట్లు తెలిపారు. సరిగ్గా ఉపఎన్నికకు ముందు ఆమె హటాత్తుగా ఢిల్లీ వెళ్ళి కేసీఆర్‌ ప్రభుత్వంపై సీబీఐకి ఫిర్యాదు చేయడం కాకతాళీయం అనుకోలేము. బహుశః బిజెపి సూచన మేరకే ఆమె సీబీఐకి ఫిర్యాదు చేసి ఉండవచ్చు.

ఈ చర్యలతో ఆమె బిజెపికి ‘బీ టీమ్’ గా పనిచేస్తున్నట్లు అనుమానం కలగడం సహజం. కానీ ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి టిఆర్ఎస్‌ పార్టీకి ‘బీ టీమ్’ గా పనిచేస్తోందని” ఆరోపించడం విశేషం.

ఇంతకీ ఆమె టిఆర్ఎస్‌, బిజెపిలలో దేనివైపు ఉన్నారనేది ఏపీ ప్రజలకు ముఖ్యంకాదు. కానీ ఆమె ఢిల్లీ పర్యటనలో తన సోదరుడు, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఏమన్నారనేది తప్పక ఆసక్తి కలిగిస్తుంది.

ఢిల్లీలో ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ, “ఓ చెల్లిగా నేను నాసోదరుడికి చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువే చేశాను. నిజం చెప్పాలంటే నా శక్తికి మించే చేశాను. కానీ నేనేదో చేశాను కదా… అని అవతలి వాళ్ళు కూడా నాకు ప్రత్యుపకారం చేయాలని ఆశించలేదు. అది స్వార్ధమే అవుతుంది,” అని అన్నారు.

ఏపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “ఆంధ్రప్రదేశ్‌లో అవినీతితో మా పార్టీకి ఎటువంటి సంబందమూ లేదు. ఏపీలో జరుగుతున్న అవినీతి గురించి అక్కడి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది,” అని వైఎస్ షర్మిల జవాబిచ్చారు.