YS Sharmila comments on K Chandrashekar Raoతెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం సూర్యాపేటలో వ్యవయసాయ మార్కెట్‌ యార్డు వద్ద ఆగి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ సిఎం కేసీఆర్‌ను ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“కేంద్రప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తానని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన సిఎం కేసీఆర్‌, తల దించుకొని తిరిగి వచ్చి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు. ధాన్యానికి క్వింటాకు రూ.1,960 గిట్టుబాటు ధర కూడా ప్రకటించారు. ఇదేదో ముందే చెపితే తాము కూడా వరి పండించుకొనేవాళ్ళం కదా? కేసీఆర్‌ మాట విని వరి వేయకుండా భూములను బీడుపెట్టి నష్టపోయామని రైతులు ఇప్పుడు బాధపడుతున్నారు.

ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించినప్పటికీ నేటికీ చాలా చోట్ల ధాన్యం కొనుగోళ్ళు మొదలవనే లేదు. సూర్యాపేట మార్కెట్‌లో రైతులు 5 రోజులుగా తమ పంటను అమ్ముకొనేందుకు ఎదురుచూస్తున్నా పట్టించుకొనే నాధుడే లేడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలుతో మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం అంతా తడిసిపోయింది.

ఈ పరిస్థితిని చూసి దళారీలు, వ్యాపారులు రైతులను ధాన్యం తక్కువ ధరకు తమకే అమ్మాలంటూ వేధిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళు మొదలుపెట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు బాధపడుతున్నారు.

వరి వేస్తే ఉరే అంటూ సిఎం కేసీఆర్‌ అని రైతులను భయపెట్టడంతో ఆయన మాట నమ్మి రైతులు 17లక్షల ఎకరాలలో వరి వేయలేదు. మరికొందరు రైతులు ఆయన మాటను నమ్మలేక ధైర్యం చేసి 35 లక్షల ఎకరాలలో వరి వేశారు. చివరికి వరి వేసినవారు, వేయనివారు అందరూ నష్టపోయారు.

ఈ మాత్రం దానికి ఢిల్లీలో ధర్నాలు చేయడం ఎందుకు? ప్లీనరీలు పెట్టి ప్రగల్భాలు పలకడం దేనికి?కేవలం రైతు బంధు ఇస్తే రైతుల కష్టాలన్నీ తీరిపోతాయా?ప్రభుత్వం ఆలస్యం చేయడం వలన వరి రైతులు మరింత నష్టపోతున్నారు. కనుక ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోళ్ళు మొదలుపెట్టాలి,” అని డిమాండ్ చేశారు.