YS Rajashekhar reddy ys jaganముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా రాజకీయాలు సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్, అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించు కోవాలనుకుంటున్నారు. అయితే విమర్శ చేసిన మరు క్షణం, ‘వైయస్’ రూపంలో అది జగన్ కు ‘బూమ్ రాంగ్’ అవుతోంది. 2004 నుండి 2009 వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైయస్ పాలన విధానాలు జగన్ కు దారులన్నీ మూసేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

2014లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రాజధానితో సహా ప్రతి అంశంలోనూ జగన్ విమర్శిస్తూ వస్తున్నారు. ముందుగా భూ సమీకరణ, భూసేకరణల పై పోరాటం చేద్దామనుకున్న జగన్ కు వైయస్ అధికారంలో ఉన్నపుడు ‘సెజ్’ల కొరకు ప్రజల నుండి తీసుకున్న లక్షల ఎకరాల భూములు ఎదురు వచ్చాయి. దీంతో భూసేకరణపై జగన్ పోరాటం తూతూమంత్రంగా ముగిసింది.

ఇక, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే రెవిన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోందని ప్రస్తావించడంతో… అవినీతిపై యుద్ధం అన్నారు… అయితే ఇంతలోనే అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో నిండా మునిగి ఉన్న జగన్, అవినీతిపై పోరాటం అంటే హాస్యాస్పదంగా మారడంతో దాన్ని కూడా విరమించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజాగా మద్యపానం విషయంలోనూ అదే పునరావృతమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం ఏరులై పారింది… బెల్ట్ షాపులు కుప్పల కొద్దీ వెలిసాయి. అంతేకాదు, విజయనగరంకు చెందిన ఓ ప్రముఖ నేతను ‘లిక్కర్ కింగ్’గా మార్చిన ఘనత వైయస్ ది. అలా మద్యపానాన్ని రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరిగా తీర్చిదిద్దడంలో వైయస్ పాత్ర మరిచిపోయేది కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులను కొంతవరకు నియత్రించగలిగారు. దీంతో మద్యపానంపై కూడా జగన్ కు విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కారణం చేతనే ఏకంగా మద్యపాన నిషేధం అంటూ వ్యాఖ్యలు చేసేసారు. ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు గనుక ఎలాంటి ప్రకటన చేసినా తనకు ఇబ్బంది కలుగదనే నేపధ్యంలో జగన్ ‘మద్యపాన నిషేధం’ అని వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయం.

ఇది కాక, ప్రతి మద్యం షాపు నుండి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్ కు లంచాలు అందుతున్నాయని వ్యాఖ్యానించి నాలుక కరచుకున్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి… అందుకు అనుగుణంగా ప్రస్తుతం ‘క్విడ్ & ప్రో’ క్రింద కేసులు కూడా నడుస్తున్నాయి. దీంతో దీనిపై కూడా జగన్ సుదీర్ఘ పోరాటం కాదు కదా… మరోసారి ఈ విమర్శలు చేసే అవకాశం కూడా లేదు. ఇలా ఒకటేమిటి… చంద్రబాబును ఇరుకున పెడదామని జగన్ ప్రయత్నిస్తున్న ప్రతి అంశంలో తన తండ్రి వైయస్ పాలన మరియు ఆ సమయంలో తాను అనుసరించిన విధానం అడ్డు గోడలా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.