జగన్ గారు... మీకు అర్ధమవుతోందా..?ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సామాన్యులకు వినోదాన్ని అతి తక్కువ ధరలో చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా ‘జగన్ అండ్ కో’ అహర్నిశలు పాటు పడుతున్న విషయం తెలిసిందే. దీనిని సినిమా నిర్మాతలు, పంపిణీదారులు, ధియేటర్ ఓనర్లు, సిబ్బంది, ఆఖరికి హీరోలు అందరూ వ్యతిరేకిస్తున్న విషయం కూడా బహిరంగమే.

ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంతగా తమపై విషం చిమ్మినా, తాము మాత్రం సినిమా టికెట్ ధరల విషయంలో ‘తగ్గేదేలే,’ సామాన్యులు చక్కంగా పోయి సినిమా చూడాల్సిందే అంటున్నారు వైసీపీ మంత్రులు. మరి ఇంతకీ వీరి సంకల్పం నెరవేరిందా? అంటే తెల్లముఖం వేయాల్సిందే. అవును… ఇప్పుడు తగ్గిన ధరలకు నిజంగా సామాన్యుడు వెళ్లి సినిమా చూస్తున్నాడా? అంటే…

ఇక్కడే నాని చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. “సినిమాకు వచ్చే ప్రేక్షకులను మీరు అవమానిస్తున్నారంటూ” నాని చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. టికెట్ ధర ఎక్కువో, తక్కువో అన్నది పక్కన పెడితే, సినిమా చూడడానికి అని వెళుతోన్న ప్రేక్షకులకు ఇపుడు ‘షో ప్రదర్శనలు లేవు’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి.

దీంతో సామాన్యుడికి ఎంత డబ్బులు పెట్టినా వినోదం లభించడం లేదు. రిలీజ్ అయిన కొత్త సినిమాలను చూడాలనే ఉత్సాహంతో ధియేటర్ కు వెళ్లే ప్రేక్షకులకు లభిస్తోన్న అనుభూతి ఇది. సిల్వర్ స్క్రీన్ పైన సినిమా చూడకపోతే, ప్రేక్షకులకున్న మరో ఆప్షన్ ఆన్ లైన్ లో సినిమాలను వీక్షించడం. రిలీజ్ రోజునే పైరసీ రూపంలో కొత్త సినిమాలు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.

పైరసీని నియంత్రించే విధంగా ప్రభుత్వము ఏ చర్యలు తీసుకోలేదు. ఈ టికెట్ ధరలకు మేము ధియేటర్లను నడపడం సాధ్యపడదని యాజమాన్యం మూసివేస్తుండగా, సినీ ప్రేక్షకులకు ఇపుడు ఆన్ లైన్ విభాగమే పెద్ద దిక్కుగా మారింది. ఇంకా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ఎక్కడ నెరవేరుతోంది? సామాన్యులు తక్కువ ధరలో సినిమాలు ఎలా చూస్తున్నారు?

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను మరియు ఓ సామాజిక వర్గం చేతిలో ఉన్న ధియేటర్లను దెబ్బ కొట్టడానికి చేస్తోన్న వైసీపీ సర్కార్ ఈ చర్యలన్నీ చేస్తోందని ప్రతిపక్షాలు, పలువురు సినీ ప్రముఖులు చేస్తోన్న ఆరోపణలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదే బలపడితే రాజకీయంగా అది వైసీపీకి చేటు చేసే కార్యక్రమమే గానీ, ఏ మాత్రం అనుకూలంగా ఉండదని గ్రహించాలి.