YS Jagan - Chandrababu Naiduఇటీవలే విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితో జరిగిన దాడి ఘటనపై ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర బలగాల అధీనంలో ఉన్న విమానాశ్రయంలో దాడి జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల దాడి జరిగిందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు.

తన హత్యకు కుట్ర జరిగిందని, కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని కోర్టును జగన్ కోరారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ కేసులో ప్రతివాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును జగన్ చేర్చడం గమనార్హం. దర్యాప్తు చెయ్యకుండానే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన పిటీషన్ లో జగన్ ఆపరేషన్ గరుడ గురించి కూడా ప్రస్తావించారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైవీ సుబ్బారెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఓ పిల్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై విచారణ వాయిదా పడటంతో జగనే స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అనుకూలమైన తీర్పు రప్పించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని జగన్ భావిస్తున్నారు.

ఈ ఘటన వీలైనంతగా ప్రజల దృష్టిలో ఉంటే 2019 ఎన్నికలలో తమకు మేలని జగన్ భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఘటనను వీలైనంతగా వాడుకుని ప్రజలలో సానుభూతి పొందాలని జగన్ ఉద్దేశం. మరోవైపు ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. విశాఖ విమానాశ్రయ పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడు శ్రీనివాసరావును నాలుగో రోజూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.