ys jaganmohan Reddy konaseema visitఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు కోనసీమ జిల్లాలో వరద ముంపు గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పి.గన్నావరమ్ మండలంలోని జి.పెదపూడి గ్రామానికి చేరుకొంటారు. ఆ తరువాత వరుసగా పుచ్చకాయలవారిపేట, అరిగెలవారిపేట, ఉడిమూడిలంక, వాడ్రేవుపల్లి, రాజోలు మండలంలోని మేకలపాలెంలో పర్యటిస్తారు. సాయంత్రం రాజమండ్రి చేరుకొని ఉభయగోదావరి జిల్లాలో సహాయ చర్యల గురించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రి రాజమండ్రిలోనే బస చేసి రేపు ఉదయం తాడేపల్లి చేరుకొంటారు.

ఉభయగోదావరి జిల్లాలను వరదలు ముంచెత్తిన్నప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే చేయగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పడవలలో, ట్రాక్టర్‌పై ప్రయాణిస్తూ నేరుగా వరదాబాధితుల ఇళ్ళవద్దకే వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టిడిపి నేతలు ఇప్పటికే బాధితులకు నిత్యావసర సరుకులు, మంచినీళ్ళు, దుప్పట్లు వగైరా అందజేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సహాయం అందేలా చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ఓ పక్క లంక గ్రామాలలో చిక్కుకొని ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోకుండా, గడప గడపకి కార్యక్రమంపై దృష్టి పెట్టిన సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు లంక గ్రామాలలో పర్యటించి వచ్చిన తరువాత వరద బాధితులకు సాయం చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఆ ఒత్తిడి భరించలేకనే బహుశః సిఎం జగన్మోహన్ రెడ్డి నేడు వరద ముంపు ప్రాంతాలలో పర్యటించేందుకు బయలుదేరినట్లు భావించవచ్చు.