YS-Jaganmohan-Reddy-Assemblyఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ ప్రతిపాదించిన బిల్లుకు ఈరోజు శాసనసభ ఆమోదముద్ర వేసింది.

ఈ సందర్భంగా టిడిపి నేతల విమర్శలకు సిఎం జగన్మోహన్ రెడ్డి సమాధానమిస్తూ, “నిజానికి చంద్రబాబు నాయుడు కంటే నేనే ఎన్టీఆర్‌ను ఎక్కువ గౌరవిస్తాను. అందుకే ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టాను. ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేముందు ఇది సరైన నిర్ణయమా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. నేను సంతృప్తి చెందిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొన్నాను. ఎందుకంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వృత్తిరీత్యా వైద్యులు. ఆయన హయాంలోనే ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి గొప్ప పధకాలు అమలుచేసి రాష్ట్రంలో నిరుపేద ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందేలా చేశారు. కనుక హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడమే సమంజసమని భావించాను,” అని చెప్పారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఎన్టీఆర్‌ను గౌరవిస్తున్నట్లయితే అసలు ఇటువంటి ఆలోచనే చేసేవారు కారు. మరో యూనివర్సిటీ లేదా మెడికల్ కాలేజీ కట్టించి దానికి తన తండ్రిపేరు పెట్టుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొన్న నిర్ణయాలను, మొదలుపెట్టిన పనులను గుడ్డిగా వ్యతిరేకించడమే విధానంగా చేసుకొని పరిపాలన సాగిస్తున్నందునే యూనివర్సిటీ పేరు మార్చినట్లు భావించవచ్చు. దీంతో చంద్రబాబు నాయుడు, టిడిపి శ్రేణులు బాధపడుతుంటే జగన్‌కు సంతృప్తి, ఆనందం కలగవచ్చునేమో కానీ ఈ పనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ అభిమానులే కాకుండా తెలుగు ప్రజలందరూ బాధపడతారని, తద్వారా ప్రజలలో తన ప్రభుత్వం పట్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందని సిఎం జగన్మోహన్ రెడ్డి గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ తెలిసినా చేశారంటే తన కక్ష, ప్రతీకారాల కోసం వైసీపీ కొంత నష్టపోయినా పర్వాలేదనుకొంటున్నారనుకోవలసి ఉంటుంది. ఇదెలా ఉందంటే నాది ఓ కన్ను పోయినా పర్వాలేదు కానీ ఎదుటవాడివి రెండు కళ్ళు పోతే చాలనుకొంటున్నట్లుంది.

సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని సొంత పార్టీకే చెందిన వల్లభనేని వంశీ ధైర్యంగా శాసనసభలోనే వ్యతిరేకించారు. బహుశః వైసీపీ ఎన్టీఆర్‌ అభిమానులు ఇందుకు లోలోన బాధపడుతుండవచ్చు. కానీ ఈ నిర్ణయాన్ని సమర్ధించుకొంటూ శాసనసభలో మంత్రి అంబటి రాంబాబు వంటివారు మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. కనుక అటువంటి వారు వచ్చే ఎన్నికలలో తమ వాచలతకు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇదివరకు మంత్రులుగా ఉన్నవారు తమకు తిరుగేలేదనుకొంటూ ఇలాగే ఎగిరెగిరి పడ్డారు. వారిని వారి అధినేతే పక్కన పెట్టేశారు. మరి ప్రజలు పక్కన పెట్టకుండా ఉంటారా? ప్రభుత్వం పరిపాలనకు, అభివృద్ధికి పరిమితం కావాలి. కానీ వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు గమనించకుండా ఐదేళ్ళు కాలక్షేపం చేస్తే ఏమవుతుందో ఎన్నికలలోనే తెలుస్తుంది. అంతవరకే ఏం చేసినా చెల్లుతుంది.