ys jagan yv subba reddy attended CBI courtప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు ఉదయం నాంపల్లిలో గల సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం ఆయన సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. జగన్‌తోపాటు మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, మాజీ పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

వైఎస్ జగన్ పాదయాత్ర ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే… కోర్టుకు హాజరయ్యే నిమిత్తం పాదయాత్రకు ఒక్కరోజు విరామం ప్రకటించి హైదరాబాద్ విచ్చేశారు. ఇప్పటివరకు 250 రోజుల పాటు సాగిన పాదయాత్రలో ఆయన 2847.6 కిలోమీటర్ల దూరం నడిచారు.

ఇంకా రెండు జిల్లాలు మిగిలి ఉండటంతో మొత్తంగా 3500 కిలోమీటర్ల పై మాటే జగన్ నడిచే అవకాశం ఉంది. ఈ పాదయాత్రపై జగన్ తో సహా ఆ పార్టీ వారంతా భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్సాఆర్ లాగా జగన్ కు ఈ సారి ముఖ్యమంత్రి యోగం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.