Why-is-Jagan-So-Mean-About-Amaravatiవైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండీ ఆంధ్రప్రదేశ్ లో సొంత మార్కు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా మంచి పని చేస్తే దానితో సొంత మార్కు పడటం మాములే. అయితే వేరే పంథా ఎంచుకున్నారు. కనిపించిన ప్రభుత్వ ఆస్తి కల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెయ్యడం ప్రారంభించారు. గుడికి, బడికి అనే తేడా లేకుండా ఈ రంగుల కార్యక్రమం జరుగుతుంది.

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా తమ పార్టీ రంగులు వేసుకునే వారు. అయితే వారు కొత్తగా కట్టినవాటికే ఆ రంగులు వేసేవారు. ఈ ప్రభుత్వం మాత్రం అవసరం లేకపోయినా పాతవాటికి కూడా రంగులు మారుస్తున్నారు. ఇప్పటికే దీని మీద సోషల్ మీడియాలో విమర్శలు ఎదురుకుంటుంది ప్రభుత్వం. తాజాగా ఇంకో వివాదస్పద నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ సాయం అందుకున్న రైతుల ఇళ్లకు గ్రామ వాలంటీర్లు స్టిక్కర్లు అతికిస్తున్నారు. ‘రైతు భరోసా ఇచ్చిన మనసున్న మారాజుకు ధన్యవాదాలు’ అంటూ సీఎం జగన్‌ చిత్రంతో కూడిన ఈ స్టిక్కర్లను.. సాయం అందుకున్న రైతుల ఇళ్ల గేట్లకు అతికిస్తున్నారు. స్టిక్కర్లు వేసే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగించారు.

ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులు వేసుకుంటే అది మీ ఇష్టం… కానీ ప్రైవేట్ ఆస్తులకు మీ స్టిక్కర్లు ఏంటి అని గ్రామాలలో కొందరు వ్యతిరేకిస్తున్నారు. స్టిక్కర్లు అంటిస్తే ఊరుకునేది లేదని గ్రామ వాలంటీర్లను హెచ్చరిస్తున్నారు. మధ్యలో వాలంటీర్లు ఇరుక్కుపోతున్నారు. ఇది ఇలా ఉండగా కేంద్రం డబ్బు కలిపి రైతు భరోసా ఇస్తున్నా స్టిక్కర్లలో మోడీ ఫోటో లేదని బీజేపీ వారి ఆక్రందన.