YS-Jagan-YSRCP----Media-Politicsకొన్ని రోజుల క్రితం జరిగిన ఒక బహిరంగ మీటింగులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఈ ఎన్నికలలో మనం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఎన్ టీవీ లాంటి యెల్లో మీడియా ఛానెళ్ళతో కూడా అని పార్టీ క్యాడర్, నాయకులను హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్య మరియు జగన్ వ్యవహార శైలి రెండూ పార్టీకి చేటు చేసేవే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు రేపు మీడియా అనేది రాజకీయాలకు చాలా కీలకంగా మారింది.

రాజకీయ పార్టీలో ఏదో విధంగా మీడియాను మేనేజ్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ వంటి వారు కూడా మీడియా విషయంలో కొంత తగ్గి వాటిని వాడుకున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో గిరి గీసుకుని కూర్చుంటున్నారు. తన ఆశలన్నీ సొంత టీవీ సాక్షి మీద, కేసీఆర్ ద్వారా వచ్చే టీవీ9 సపోర్టు మీదే పెట్టుకున్నారు. మిగతా టీవీలను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం వల్ల అవి వైఎస్సార్ కాంగ్రెస్ కు దూరంగా జరుగుతున్నాయి. తద్వారా టీవీ5, ఎన్ టీవీ వంటి ఛానళ్ళు కూడా టీడీపీకి దగ్గరగా వెళ్తున్నాయి.

ఎన్నికలు దాదాపుగా రెండున్నర నెలలు మాత్రమే ఉండటంతో అన్ని టీవీ యాజమాన్యాలతో ఒకసారి కూర్చుని మాట్లాడాలని జగన్ మీద పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారట. ఆయన మాత్రం తన ఈగోను పక్కన పెట్టి ఆ పని చెయ్యలేకపోతున్నారని సమాచారం. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ విషయం తీవ్రం అవుతుందని వైకాపా వర్గాలు భయపడుతున్నాయి. మీరు ఏమీ మాట్లాడనవసరం లేదు… వారిని పిలిచి మేము అధికారంలోకి రావడం ఖాయం… ఆ తరువాత మనం కలిసి పని చేద్దాం అని చెప్పండి చాలు అంటున్న వినిపించుకోవడం లేదట.

కనీసం ఈనాడు, జ్యోతిని వదిలి మిగతా వారితో మాట్లాడండి అని అడిగినా జగన్ స్పందించడం లేదని తెలుస్తుంది. పైగా టీవీల మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీని వల్లే ఇటీవలే టీడీపీ నుండి వైకాపాకు వలసలు ఎక్కువగా ఉన్నా దానికి తగ్గ మైలేజ్ రావడం లేదని వారు మధనపడుతున్నారు. అయితే జగన్ కు చెప్పగలిగేది ఎవరు? ఎన్నికలు దగ్గరలో ఉండడంతో పల్లెలలో ఎక్కడైతే జన సాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ సాక్షి పత్రిక ఉచ్చితంగా పంపిణీ చెయ్యడం మొదలు పెట్టారనే సమాచారం వస్తుంది.