YS Jagan Kapu Reservationరాజకీయాలను కుల, మతాలను వేరు చేసి చూడడం అనేది ఇండియాలో జరిగేది కాదని అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకుల అధికార దాహం కోసం కుల, మతాలను అడ్డం పెట్టుకుని అందలం ఎక్కడం అనేది సర్వ సహజమైన అంశం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, గత సార్వత్రిక ఎన్నికలలో మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ముందుకు రాగా, ఆ తర్వాత ప్రతిపక్షానికి పరిమితం కావడంతో, మతాన్ని పక్కనపెట్టి కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభా కలిగినటువంటి కాపు కులాన్ని రెచ్చగొట్టి, తద్వారా ప్రయోజనం పొందాలనుకున్న మాట వాస్తవమే. ముద్రగడ పద్మనాభం ద్వారా ఏపీలో కల్లోలం సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ కార్యాచరణకు ప్రస్తుతం భవిష్యత్తు లేకుండా పోయింది. తాజాగా ముగిసిన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్ పాస్ కావడంతో, బాల్ తన కోర్టులో నుండి కేంద్రం కోర్టులోకి వేయడం చంద్రబాబు వంతయ్యింది.

ఫైనల్ గా కాపులకు రిజర్వేషన్ వర్తించినా, లేకున్నా… దానికి సంబంధించిన తొలి అడుగును అయితే చంద్రబాబు విజయవంతంగా వేయగలిగారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జగన్ లేకపోవడం బాబుకు మరో ప్లస్ పాయింట్ గా భావించవచ్చు. ఈ పరిణామాలతో భవిష్యత్తులో కాపు రిజర్వేషన్లపై జగన్ మాట్లాడే అర్హతను కూడా కోల్పోయినట్లయ్యింది. గత ఎన్నికలలో మతాన్ని, ఆ తర్వాత కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన జగన్ తదుపరి ఏ అంశంతో ముందుకు వస్తారో సమాలోచనలు రాజకీయ వర్గాలలో జరుగుతున్నాయి.

అయితే రెండు సార్లు విఫలమైన జగన్, ఏ అంశంతో వచ్చినా, దానిని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నది స్పష్టమవుతున్న విషయం. అందుకు నిదర్శనంగానే ప్రస్తుతం జరుగుతోన్న ‘ప్రజా సంకల్ప యాత్ర’ నిలుస్తోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో పాదయాత్రలకు ఉన్న విశిష్టత జగన్ పాదయాత్రలో మచ్చుకైనా కానరాకపోవడం… భవిష్యత్తు ప్రజా తీర్పుకు నిదర్శనమా? అనేది 2019లో తేలే అంశం.