YS_Jagan_Amit_Shahఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని చెప్పుకొంటున్నప్పటికీ, అది పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి, మళ్ళీ వైసీపీయే గెలువబోతోందని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఆడుతున ‘మైండ్ గేమ్’ అని అందరికీ తెలుసు.

ఓ పక్క రాష్ట్రంలో టిడిపికి నానాటికీ ప్రజాధారణ పెరుగుతుండటం, మరోపక్క జనసేన కూడా బలం పుంజుకొని టిడిపితోనే పొత్తులు పెట్టుకొనే ఆలోచన చేస్తుండటం జగన్‌కు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన మాటలలోనే తెలుస్తోంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ తీవ్రంగా నష్టపోతుంది. కానీ నేటికీ ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా ఇంకా బిజెపి కోసం ఎదురుచూస్తుండటం జగన్‌కు ఇంకా ఆందోళన కలిగించే విషయమే.

ఒకవేళ బిజెపి కూడా వాటితో చేతులు కలిపితే ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమి ఖాయం అయిపోతుంది. కనుక బిజెపిని వాటితో కలవకుండా అడ్డుకొనేందుకు ఎన్డీయేలో చేరేందుకు వైసీపీ సిద్దమని జగన్‌, అమిత్‌ షాతో చెప్పిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

దక్షిణాదిన బిజెపి అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. ఇటీవల జరిగిన ఎన్నికలలో అక్కడా ఓడిపోవడంతో అదీ బిజెపి చేజారిపోయింది. ఇక బిజెపికి అతిపెద్ద అగ్నిపరీక్ష 2024లో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారం నిలుపుకోవడం. మోడీ పేరు చెప్పుకొని బిజెపి వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు మోడీని గద్దె దించేందుకు బిజెపి వ్యతిరేకశక్తులు ఏకం అవుతున్నాయి. ఇదే సమయంలో బిజెపి మిత్రపక్షాలు ఒకటొకటిగా దూరం అవుతున్నాయి.

ఇంతకాలం కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నందునే బిజెపి నిశ్చింతగా ఉండగలుగుతోంది. కానీ కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలోనే బిజెపి ఓడిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలో బిజెపిని కాదనేందుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కారణం కనిపిస్తోంది. కనుక ఈసారి ఉత్తరాది రాష్ట్రాలలో సాధించిన సీట్లతో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావడం దాదాపు అసంభవమే.

ఈ పరిస్థితులలో బిజెపికి జగన్, జగన్‌కు బిజెపి అవసరం చాలా ఉంది. కనుక వైసీపీని ఎన్డీయేలో చేర్చుకొనే ప్రతిపాదన గురించి బిజెపి అధిష్టానం ఏపీ బిజెపి నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏపీ నిలువునా మునిగిపోతున్నా కేంద్రం పట్టించుకోకపోగా ఇంకా వైసీపీ ప్రభుత్వానికి అప్పులు ఇప్పిస్తూ ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేస్తున్నందుకు ఏపీ ప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలుచేయకుండా ఏపీని మోసం చేసిందనే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీ విషయానికి వస్తే దాని పాలనలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తూండటం, తిరుమల కొండపై మద్యం, గంజాయి అమ్మకాలు, పరమత ప్రచారం వంటివి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీ బిజెపి అమరావతికి మొగ్గు చూపుతుంటే, జగన్‌ మూడు రాజధానులంటున్నారు. కనుక బిజెపి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోక తప్పదు.

ఒకవేళ బిజెపి, వైసీపీలు చేతులు కలిపిన్నట్లయితే ఏపీలో రాజకీయ బలాబలాలు ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. బహుశః త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రావచ్చు.