YS_Jagan_Cross_Votingఅధికారంలో ఉన్నవారు… ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా పట్ల సహృద్భావంతో హుందాగా మెలగాలని ఆశించడం అత్యాశ కాదు. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తేచాలనుకొనేవారు తమకు ఈ పదవులు, అధికారం ఎప్పటికీ శాస్వితమనే భ్రమలో అహంభావంతో, దురహంకారంతో వ్యవహరిస్తే ఏమవుతుందో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి.

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ‘ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్’ (పట్టభద్రులు) మాత్రమే ఓట్లు వేస్తారు కనుక ఆ ఫలితాలను పరిగణనలోకి తీసుకోనక్కరలేదని సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే సమర్ధించుకొన్నారు. కానీ వెంటనే జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వైసీపీ ఒక సీటుని టిడిపికి కోల్పోవడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు?ఈ ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేయలేదు… సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓట్లు వేశారు… అయినా వైసీపీ అభ్యర్ధి ఓడిపోయిందంటే అర్దం ఏమిటి?ప్రజలే కాదు… వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్నారనే కదా?

Also Read – పిఠాపురం MLA గారి తాలూకా ఎలివేషన్స్..!

2019 శాసనసభ ఎన్నికలలో 23వ తేదీన విడుదలైన ఫలితాలలో టిడిపి కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకొన్నప్పుడు, “చూశారా దేవుడు స్క్రిప్ట్ ఎంత గొప్పగా వ్రాశాడో?” అంటూ సిఎం జగన్‌ బహిరంగసభలలో పదేపదే దెప్పిపొడిచేవారు. కానీ ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే 2023లో మార్చి 23వ తేదీన వచ్చిన ఫలితాలలో అదే టిడిపి 23 ఓట్లతో విజయం సాధించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు ఎద్దేవా చేశారు.

టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో నలుగురిని నయన్నో, భయానో వైసీపీలోకి రప్పించుకొంది. కానీ ఇప్పుడు వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలే టిడిపికి ఓట్లు వేసి గెలిపించారు. దీంతో టిడిపికి మళ్ళీ 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని స్పష్టమైందన్నారు అచ్చన్నాయుడు. ఇదీ దేవుడి స్క్రిప్టే కదా?అని ప్రశ్నించారు.

Also Read – కేసీఆర్‌ ట్రాప్‌లో రేవంత్‌ రెడ్డి పడ్డారా?

వైసీపీలో అసంతృప్తి ఉందనేది ఈ ఎన్నికలతో స్పష్టమైంది. వైసీపీలో ఇద్దరే క్రాస్ ఓటింగ్ చేశారు కనుక ఇద్దరే అసంతృప్తిగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే సమర్ధించుకొన్నారు. అయితే వైసీపీలో ఇద్దరే అసంతృప్తిగా ఉన్నారా?అంటే 16 మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్‌లో ఉన్నారని నిన్ననే టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. దానర్దం ఏమిటి?

వచ్చే ఎన్నికలలో కనీసం 30-40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టక తప్పదని ఐ-ప్యాక్ నివేదికలు ఇవ్వడం, పనితీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్స్ ఇవ్వనని సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగులు ఇస్తుండటానికి అర్ధం ఏమిటి? మంత్రివర్గ ప్రక్షాళన చేసుకొని కొందరు మంత్రులను తొలగించడం వంటివన్నీ దేనికి?ఇవన్నీ ఏం చెపుతున్నాయి?

Also Read – సామాన్యులు కూడా రాజకీయాలకు బలి కావలసిందేనా?

పార్టీలో అసంతృప్తి రాజుకొని పొగలు చిమ్ముతున్నా వైసీపీ అధినేత ‘175 సీట్లు మనవే’ అంటూ పార్టీలో అందరినీ భ్రమలలో ఉంచితే ఈ ఎన్నికలు వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టిన్నట్లు చూపాయి. ఇంకా అహంభావంతో విర్రవీగుతూ ఇదే భ్రమలలో ఉండాలనుకొంటే ఏమవుతుందో ఈ ఎన్నికలు తెలియజేశాయి. కనుక ఇప్పటికైనా వైసీపీ వైఖరి మారుతుందనుకొంటే, వైసీపీ నేతలు ఇంకా అహంకారంతోనే మాట్లాడుతుండటం విస్మయం కలిగిస్తుంది.

మంత్రులు కాకణి, రోజా స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడుని చివరిసారిగా పండగ చేసుకోనీయండి. ఎందుకంటే ఇదే ఆయనకు చివరి రాజకీయ పండగ. వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాలలో ఆయనా ఉండరు… టిడిపి కూడా ఉండదు,” అని అన్నారు. అయితే ఈ ఎన్నికలతోనే వైసీపీ పతనం ప్రారంభం అయ్యిందని, వచ్చే ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అచ్చన్నాయుడు అన్నారు.