ys-jagan-ysrcp-caste-politicsఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అధికార వైసీపీ-టిడిపిల మద్య వ్యవహారమనిపిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా దానిపై స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఆ రెండు పార్టీల మద్య జరుగుతున్న మాటల యుద్ధాలను పక్కన పెడితే అసలు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత హటాత్తుగా ఎందుకు ఇటువంటి వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నారని ఆలోచిస్తే దానికి చాలా బలమైన కారణమే కనిపిస్తోంది.

అమరావతిపై కమ్మ కుల ముద్ర వేయడమే అతిపెద్ద తప్పిదం. రాష్ట్రంలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని అవమానించి వారిని దూరం చేసుకోవాలని ఏ రాజకీయ పార్టీ కోరుకోదు. కానీ చంద్రబాబు నాయుడు, రామోజీరావు (ఈనాడు), వేమూరి రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి) అదే సామాజికవర్గానికి చెందినవారు కనుక వారిపై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న సిఎం జగన్, అమరావతిని పక్కన పెట్టడం కోసం దానిపై కమ్మ కుల ముద్రవేయడానికి వెనకాడలేదు. దాని వలన పార్టీకి ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఉండదని సిఎం జగన్‌కు బాగా తెలుసు. అయినా వెనకడలేదు.

ఆ తప్పిదాన్ని వెంటనే సరిచేసుకొనే అవకాశం ఉంది. కానీ మూడు రాజధానుల ప్రతిపాదనతో ఆ తప్పిదాన్ని ఎన్నటికీ సరిచేసుకోలేని స్థితికి వైసీపీ చేరుకొంది. అంతేకాదు… అమరావతి కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులనుద్దేశ్యించి అవమానకరంగా మంత్రులు మాట్లాడుతూ, వారిపై కూడా కమ్మకుల ముద్ర, టిడిపి ముద్ర వేస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ఈ పరిణామాలతో ఇక రాష్ట్రంలో కమ్మకులస్థులు వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓట్లు వేయరని వేరే చెప్పక్కరలేదు. ఇక ఎలాగూ వారు తమకు దూరమై మళ్ళీ టిడిపికి దగ్గరవుతున్నప్పుడు ఇక వారిని పట్టించుకోవలసిన అవసరమేలేదని సిఎం జగన్మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. బహుశః అందుకే ఆ వర్గానికి చెందిన కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించి ఉండవచ్చు. ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని అందరికంటే ముందుగా వ్యతిరేకించింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇది ఆరంభం మాత్రమే.

రాష్ట్రంలో ఓ బలమైన సామాజిక వర్గాన్ని దూరం చేసుకొంటున్నప్పుడు, దానిని రాజకీయంగా బ్యాలెన్స్ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కనుక ఇప్పుడు రాష్ట్రంలో మరో బలమైన సామాజిక వర్గంగా ఉన్న తన రెడ్డి సామాజికవర్గ ప్రజలను, వారితో పాటు మైనార్టీ వర్గాలను ఆకట్టుకొనేందుకె సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ దుసాహసం చేసి ఉండవచ్చు. తద్వారా రాష్ట్రంలో టిడిపిని దాని వెనుక ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని ఎదిరించి ఓడించగల ఏకైక మొనగాడు తానేనని సిఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. కనుక మున్ముందు ఇటువంటి పనులు మరిన్ని చేసినా ఆశ్చర్యం లేదు.

కానీ ఓ వ్యక్తి (చంద్రబాబు నాయుడు) లేదా కొందరు వ్యక్తులపై ద్వేషంతో పేర్లు, ఊర్లు మార్చడం వంటి పనులు చేయడం వలన రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిపోతుంది. అయినా పర్వాలేదనుకొని వైసీపీ ప్రభుత్వం గుడ్డిగా మొండిగా ముందుకు సాగుతుండటం ప్రజల దురదృష్టం కాక మారేమిటి?