YS Jagan YSR Rythu Bharosa irks kcr‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు నెల్లూరులో ప్రారంభించారు. అర్హులైన ప్రతీ రైతు కుటుంబానికీ ఏడాదికి 13,500 రూపాయిల చప్పున ఐదు సంవత్సరాలలో 67,500 మేర లబ్ధి పొందనున్నారు. కౌలు రైతులలో అగ్రవర్ణాల తప్ప మిగతా వారందరినీ ఈ పథకానికి అర్హులను చేసింది ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా ఈ పథకం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు కొత్త తంటా తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వలే తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని అక్కడి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సమ్మె ఇప్పటికే ఇద్దరు కార్మికుల బలిదానాలకు దారి తీసింది.

దీనితో కేసీఆర్ ప్రభుత్వం విపరీతమైన ఒత్తిడిలో ఉంది. కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో కేవలం భూయజమానులే అర్హులు. కౌలు రైతులకు సాయం అందించడం కుదరదు అని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కుదిరినప్పుడు ఇక్కడ ఎందుకు కుదరదు అని తెలంగాణ కౌలు రైతుల నుండి డిమాండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది అనే చెప్పుకోవాలి. ఇప్పటికే రైతుబంధు వల్ల డబ్బున్న రైతులు మాత్రమే లబ్దిపొందుతున్నారు అనే విమర్శ ఉంది. మరోవైపు జగన్‌ 2017 గుంటూరు ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని, ఆ తరువాత కేంద్రం కూడా అమలు లోకి తెచ్చిందని సాక్షి ప్రచారం చెయ్యడం విశేషం.