Ys jagan YSR Congress - Prasanth Kishor Politicsగడిచిన మూడు, నాలుగు సంవత్సరాలుగా వైసీపీ అధినేత తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజాక్షేత్రంలో అబాసుపాలవుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిపక్షం బలపడాల్సింది పోయి, రోజురోజుకు మరింత వీక్ అవుతుండడం శోచనీయం. దీంతో తన తప్పులకు చెక్ పెట్టాలని భావించారో లేక తన నిర్ణయాలపై నమ్మకం కోల్పోయారో గానీ, గత ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ తో జగన్ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

2019లో గానీ లేదా అంతకన్నా ముందుగా గానీ ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగితే అధికారంలోకి రావడమే లక్ష్యంగా… ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం కానివ్వరాదన్న ఆలోచనలో ఉన్న జగన్, తన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు ప్రశాంత్ సహకారాన్ని తీసుకోనున్నారు. జగన్ తో డీల్ కుదుర్చుకున్న ప్రశాంత్, త్వరలోనే ఏపీకి వచ్చి మకాం వేయడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, ప్రజా నాడిని అంచనా వేసే పనులు ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత తన టీమ్ సాయంతో వైకాపాకు గెలుపు దిశగా సాగేందుకు సలహాలు, సూచనలు అందించనున్నారని తెలుస్తోంది. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ముందస్తు ఎన్నికల సంకేతాలు రావడంతో సాధ్యమైనంత త్వరగా ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతారని సమాచారం. అయితే ఎవరి మాట వినడనే పేరు సంపాదించుకున్న జగన్, ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాటలు ఎంతవరకు వింటారనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.