YS-Jagan-YS-Sharmila-YS-Suneetha-Narreddyఓ చెల్లెల్లు… మా తండ్రి ప్రమాదంలో మరణించలేదు… హత్య చేయబడ్డారని ఆరోపిస్తున్నారు. మరో చెల్లెలు మా అన్న రాజ్యంలో నా తండ్రి హత్యపై దర్యాప్తు సక్రమంగా జరుగుతుందనే నమ్మకం లేదంటారు. వారిద్దరూ ఎవరో అర్దమయ్యే ఉంటుంది. ఒకరు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల మరొకరు బాబాయ్ కూతురు సునీతా రెడ్డి.

“వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించలేదు కొందరు కుట్రచేసి ఆయనను హత్య చేశారని, నన్ను కూడా హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని” వైఎస్ షర్మిల నిన్న సంచలన ఆరోపణలు చేశారు. కానీ ఊహించినట్లే ఆమె ఆరోపణలపై వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. సొంత చెల్లెలు తనకు ప్రాణాపాయం ఉందని బహిరంగంగా చెపుతున్నప్పుడు జగనన్న స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

జగనన్న మరో చెల్లెల్లు అంటే వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. తన తండ్రి హత్య జరిగి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు ఆ కేసు అతీగతీ లేకుండా సాగుతోందని, సాక్షులు ఒకరొకరే అనుమానాస్పద పరిస్థితులలో చనిపోతున్నారని, నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని, చివరికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల మీద కేసులు వేస్తూ దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ కేసు విచారణ సక్రమంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందనే నమ్మకం తనకు లేదని కనుక ఈ కేసును పొరుగు రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేయాలని సునీతా రెడ్డి సుప్రీంకోర్టును అభ్యర్ధించారు.

జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య దర్మాసనం ఆమె పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. మళ్ళీ ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.