ys jagan ys sharmila pay-floral-tributes-to-ysr-on-his-68th-birth-anniversaryఅక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన సమయంలో… పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్న వైఎస్ షర్మిల స్వరం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తండ్రి వైఎస్ మాదిరి ఆకట్టుకునే ప్రసంగాలు చేయడంలో షర్మిల సిద్ధహస్తురాలిగా రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొన్న నేపధ్యంలో… ఏదొక అసెంబ్లీ స్థానం నుండి షర్మిల బరిలోకి దిగడం ఖాయం అన్న టాక్ హల్చల్ చేసింది. అయితే ఆ తర్వాత జగన్ జైలు నుండి విడుదల కావడం, నెమ్మదిగా షర్మిలను పక్కన పెట్టడం జరిగిపోయింది.

జగన్ కంటే మిన్నగా ప్రసంగాలు చేస్తున్నారన్న కారణంతోనే షర్మిలను రాజకీయాలకు దూరంగా ఉంచారని అప్పట్లో పొలిటికల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కారణాలు ఏవైనా క్రియాశీలక రాజకీయాలకు వైఎస్ షర్మిల దూరంగా ఉందన్న విషయం బహిరంగమే. అయితే చాలా కాలం తర్వాత షర్మిల మీడియా కంట పడింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు విచ్చేసిన కుటుంబ సభ్యులలో వైఎస్ విజయమ్మ, జగన్ లతో పాటు వైఎస్ షర్మిల కూడా ఉండడం విశేషం.

దీంతో పార్టీ వర్గాలలో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే షర్మిల అడుగులు కేవలం ఇడుపులపాయ వరకే పరిమితం అవుతాయా? లేక మున్ముందు పార్టీలో కీలకపాత్ర పోషిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇదంతా జగన్ తీసుకునే నిర్ణయంపై మరియు అక్రమాస్తుల కేసులో జరుగుతున్న విచారణపై ఆధారపడి ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత పార్టీ అధినేత జగన్ మాత్రం గుంటూరులో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశానికి బయలుదేరారు.