YS Jagan -Welfare Schemesగతంలో సంతోషంగా., సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం., ఇప్పుడు నిరాశ, నిస్పృహలతో., సంక్షోభాల దిశగా పయనిస్తోంది అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్న ఆర్ధిక పరిస్థితులకు జగన్ అవలంభిస్తున్న అనాలోచిత విధానాలే కారణమంటూ టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.

నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఉన్న రెవిన్యూ లోటును ఒక దారిలో పెట్టుకుంటూ., సంక్షేమంతో కూడిన అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లారు చంద్రబాబు. రాజధాని నిర్మాణం కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వాలు చేతులు మారడంతో “కడలి మధ్యలో నిలిచిన చుక్కానిలా” రాష్ట్ర భవిష్యత్తు మిగిలిపోయింది. జగన్ నేతృత్వంలో అటు ముందుకి వెళ్ళలేదు, హైకోర్టు పుణ్యమా అంటూ ఇటు వెనుకకి రాలేదు.

గెలుపే ప్రధానంగా 2019 ఎన్నికలలో జగన్ ఇచ్చిన “హామీలు ఆకాశాన్ని” తాకాయి. ఆ హామీల అమలుకు రాష్ట్ర “ఆర్ధిక పరిస్థితి పాతాళానికీ” పడిపోయిందని ప్రతిపక్షాలతో పాటు ఆర్ధిక నిపుణులు కూడా పేర్కొంటున్నారు. హామీల అమలుకు ఇప్పటికే రాష్ట్రం “అప్పుల ఆంధ్రప్రదేశ్”గా మారిందని, ఒకానొక సందర్భంలో కేంద్ర పెద్దలే రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.

‘నవరత్నాల’ పేరుతో జగన్ రాష్ట్రంలో ‘నవ విధ్వంసాన్ని’ సృష్టించారని వైసీపీ ఎంపీ రఘురామరాజు తన రచ్చబండ కార్యక్రమంలో ఎన్నోసార్లు వెల్లడించారు. ప్రజలకు హామీలు ‘ఆకాశంలో’ చూపించిన జగన్, వాటి అమలుకు ప్రజల మీద వేసే పన్నులతో అదే ప్రజలకు ‘చుక్కలు’ చూపిస్తున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

‘అమ్మ ఒడి’ అందుకోవాలంటే కాస్ట్లీ చీప్ లిక్కర్ నాన్న తాగాల్సిందే., జగనన్న చేయుత పధకం పొందాలంటే అధికారుల చలానా పత్రం పొందాల్సిందే., రైతు భరోసా కావాలంటే కౌలు రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిందే., ఫీజు రీయింబర్స్ జరగాలంటే ఎయిడెడ్ కాలేజీల విలీనం తప్పనిసరి అంటూ ప్రతి వ్యవస్థను భ్రష్టుపట్టించిన తుగ్లక్ సీఎం జగన్ రెడ్డి అంటూ టీడీపీ నాయకుడు లోకేష్ పంచ్ ల పటాకాలను పేలుస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “బాదుడు” గురించి మాట్లాడి, అధికారంలోకి వచ్చాక నష్టాలను “భరించలేమంటే” కష్టం జగన్ గారు అంటూ జనసేన అధినేత పవన్ తనదైన ప్రాసలతో పదునైన ప్రశ్నలను సంధిస్తున్నారు. ప్రభుత్వ భూములను తాకట్లు పెట్టి., కేంద్ర ప్రభుత్వం నుండి అప్పులు తెచ్చి., ప్రజలపై పన్నుల భారం మోపి., రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కృంగతీసి ప్రజలకు మీరు చేస్తున్న అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రజలకు రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు నేల మీద ఉండి., అభివృద్ధి ఆకాశంలో ఉన్నప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బంగారు మయమవుతుంది. రాష్ట్రాధినేత ఆలోచనలు ఆకాశాన్ని తాకొచ్చు కానీ., ఆచరణ మాత్రం నేల మీదే ఉండాలి. అప్పుడే రాష్ట్ర అప్పులు పాతాళంలోకి., ప్రజల ఆర్ధిక ప్రగతి ఆకాశంలో ఉంటుంది.