గతంలో పొత్తులు విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన వైఖరి ఉండేది. ఎవరితో పోతు పెట్టుకోము, ఎప్పటి నుండో పార్టీ జెండా మోస్తున్న నాయకులకు అన్యాయం చేయము అని చాలా ఇంటర్వ్యూలలో జగన్ తరచు చెబుతుండే వారు. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఇంఛార్జ్ లు ఉండి దాదాపుగా వారే అభ్యర్థులుగా చలామణి అయ్యే వారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
టీడీపీ నుండి వచ్చే నాయకులకు ఎర్ర తివాచి పరుస్తున్నారు. ఇప్పటివరకూ ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మరి కొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న ఓ మోస్తరు పేరున్న నేతలను కూడా తీసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఇపుడు కొత్తగా చేరుతున్న అవకాశవాద నాయకులకు సీట్లిస్తే అదే ఊళ్ళల్లో పార్టీ బాధ్యతలు చూసిన వాళ్ళ గతి ఏంది?? ఇది రాజకీయ అవకాశవాదం కాదా?
జగన్ గారూ … ఇదేనా మాట తప్పక పోవడం…. మడం తిప్పకపోవడం? ఇప్పటివరకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో చేరిన టీడీపీ వారిలో ఆమంచి కృష్ణ మోహన్ తప్ప ఎవరూ బలమైన నాయకులు కాదు. వీరికి టీడీపీ సీటు నిరాకరించింది. ఈ క్రమంలో వారిని చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం అంటే ఆత్మహత్యసదృశ్యమే. ఇందులోని నేతలన్ని గతంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది కూడా. వారు ఇప్పుడు లోటస్ పాండ్ కి రావడంతో పునీతులు అయిపోయారు. ఎన్నికల ముంగిట టీడీపీని సైకలాజికల్ గా దెబ్బ కొడుతున్నా అనుకుని తప్పటడుగులు వేస్తున్నారా?




