YS jagan wasted assembly sessionsప్రజా సమస్యలపై చర్చించి అధికార పక్షాన్ని కడిగి వేసేందుకు ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను వినియోగించుకుంటుందని భావిస్తే… పప్పులో కాలేసినట్లేనని ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిరూపిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ముందు పార్టీ సమస్యలను తీర్చుకోవడానికి అసెంబ్లీ సమావేశాలను వాడుకోవడం అత్యంత హేయమైన చర్యగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల ముగిసిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను తన పార్టీ నుండి అధికార పార్టీలోకి వెళ్ళిన ఎనిమిది మంది సభ్యులను టార్గెట్ చేసుకుని వ్యూహాలు పన్నడం జగన్ నేర్చుకున్న సరికొత్త రాజకీయం. ఎలాగైనా ఈ ఎమ్మెల్యేల హోదా పోగొట్టాలని ముందుగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి భంగపడ్డారు. ఆ మరుసటి రోజే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టి సదరు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేయాలని చూసారు. అది కూడా బోల్తా కొట్టడంతో చివరగా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ ను వినియోగించుకున్నారు.

అయితే జగన్ వేసిన ఎత్తుగడకు ప్రతిసారి ఈ ఎమ్మెల్యేలందరూ తప్పించుకోగలిగారు. దీని వెనుక ఉన్న “మాస్టర్ బ్రైన్” ఎవరిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వంపై మరియు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన రోజే చర్చలు జరిపి జగన్ వ్యూహాన్ని దెబ్బ కొట్టింది అధికార పక్షం. దీంతో అసలు సభకు హాజరు కాని ఎమ్మెల్యేల ప్రస్తావన లేకపోయింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లు విషయంలో విప్ జారీ చేయడంతో ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభకు హాజరై ఓటింగ్ లో పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది.

కానీ, ఆరోగ్య కారణాల రీత్యా తాము సభా సమావేశాలకు హాజరు కాలేకపోతున్నామని స్పీకర్ కు లేఖ రాసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మధ్యాహ్న సమయానికి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రత్యక్షమయ్యారు. జగన్ విప్ జారీ చేయడంతో హాజరైన వీరంతా తన చేతికి చిక్కినట్టే భావించిన జగన్ కు అధికార పక్షం షాకిచ్చింది. అధికార పక్షానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో, ద్రవ్య వినిమయ బిల్లు శాసనసభ ఆమోదించింది అంటూ ఓటింగ్ నిర్వహించకుండానే స్పీకర్ ప్రకటన చేసారు.

అయితే దీనిపై ఖచ్చితంగా ఓటింగ్ జరగాల్సిందేనని, అది కూడా అధికార పక్షంకు ఎన్ని ఓట్లు, ప్రతిపక్షానికి ఎన్ని ఓట్లు వచ్చాయో విభజన చేయాలని పట్టుపట్టారు. అయితే ‘మాస్టర్ బ్రైన్’ ముందు జగన్ వాదన నిలవలేకపోయింది. దీంతో జగన్ జారీ చేసిన విప్ కు కూడా ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా తేలింది ఏమిటంటే… ‘అనుభవం’ ముందు ఆలోచన లేని ఆగ్రహం, ఆవేశం మరోసారి ఓటమిని చవిచూసాయి. అలాగే ‘హనుమంతుడి ముందు గుప్పిగంతులు వేస్తే’ ఎలాంటి అనుభూతి కలుగుతుందో అసెంబ్లీ వేదికగా జగన్ పన్నిన ‘పన్నాగాలు’ కూడా అలాంటి అనుభూతులనే చవిచూసాయని రాజకీయ విశ్లేషకుల కధనాలు.

Attack movie review rgv

savitri movie review nara rohith