YS-Jagan-Warns-MLA Roja‘ఫైర్ బ్రాండ్’ రోజాకు వైసీపీలో కష్టాలు ప్రారంభమయ్యాయా? అంటే రాజకీయ వర్గాలలో అవుననే సమాధానమే లభిస్తోంది. అనునిత్యం తెలుగుదేశం పార్టీపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడుతూ ప్రతి రోజూ మీడియాలో హల్చల్ చేసే రోజాకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారనే విషయం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజా వ్యవహార శైలి, ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు జగన్ కు ఇబ్బందిని కలిగించాయని… ఈ నేపథ్యంలో ఆమెను పిలిపించుకుని క్లాస్ పీకారని, తీరు మార్చుకోవాలని లేకపోతే వేటు తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం.

పవిత్రమైన తిరుమల కొండపై కూడా రోజా రాజకీయ విమర్శలకు దిగుతుండటంతో ఈ మధ్య శివసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో రోజాను ఇంటికి పిలిపించుకుని జగన్ మందలించారనే విషయంపై కూడా వైసీపీ నేతల మధ్య చర్చ జరుగుతోందట. అలాగే నియోజకవర్గంలో రోజా ఉండటం లేదన్న ఫిర్యాదులు కూడా జగన్ కు కోపం తెప్పించాయట. సర్వే రిపోర్టులు కూడా రోజాకు వ్యతిరేకంగా రావడం, ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండాల్సింది పోయి… ఇలా దూరంగా ఉండటం ఏమిటని, ఏది తోచితే అది మాట్లాడకుండా… పార్టీ సూచించిన విధంగా మాట్లాడాలంటూ రోజాకు జగన్ సూచించినట్టు సమాచారం.

అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే, తానే హోం మంత్రిని అంటూ రోజా ప్రచారం చేసుకుంటున్నారనే విషయంపై కూడా జగన్ మండిపడ్డట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే పరిస్థితి మరోలా ఉంటుందని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో, రోజా చెప్పకనే చెప్పారు అంటున్నారు విశ్లేషకులు. వైకాపా అధినేత వైఎస్ జగన్ ఏ నిరసన దీక్ష నిర్వహించినా, పక్కనే ఉండే పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్యే రోజా, విశాఖపట్నంలో జరిగిన మహాధర్నాకు హాజరు కాకపోవడం వెనుక కారణాలు ఇవేనని చర్చించుకుంటున్నారు.