YS-Jagan-32-MLAసిఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నవి రెండే రెండు. 1. సంక్షేమ పధకాలు, 2. గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం. సంక్షేమ పధకాల పేరుతో రాష్ట్రంలో వైసీపీకి ఓ బలమైన ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకొందామని ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలిరోజు నుంచే జగన్‌ ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్‌,కాంట్రాక్ట్ కార్మికులకి, పెన్షనర్లకి నెలనెలా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేకపోతున్నా సిఎం జగన్మోహన్ రెడ్డి ఏనాడూ ఆందోళన చెందినట్లు కనబడలేదు. కానీ ప్రతీ సంక్షేమ పధకాన్ని సకాలంలో బటన్ నొక్కి టంచనుగా విడుదల చేయకపోతే ఆందోళన చెందుతుంటారు. కనుక ఆయన సంక్షేమ పధకాలకి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో అర్దం చేసుకోవచ్చు.

అయితే సంక్షేమ పధకాలని ఓట్లుగా మార్చుకొనేందుకే గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమాన్ని మే 11వ తేదీన ప్రారంభించారు సిఎం జగన్‌. తమ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాల గురించి లబ్దిదారులుగా పేర్కొనబడే ఓటర్లకు పదేపదే గుర్తుచేస్తూ వారందరూ వచ్చే ఎన్నికలలో వైసీపీకే ఓట్లు వేసేలా చేయాలనేదే ఈ గడప గడపకి కార్యక్రమం ప్రధానోదేశ్యం. కనుక పేద ప్రజలపై జాలిపడి వారిని ఉద్దరించేందుకే సంక్షేమ పధకాలు ఇస్తున్నామని చెప్పుకోవడం మరో పచ్చి అబద్దమే. అది వేరే సంగతి.

సంక్షేమ పధకాల లబ్దిదారులను వైసీపీ ఓటర్లుగా మార్చుకోవాలని సిఎం జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకి, పార్టీనేతలకి పదేపదే చెపుతున్నప్పటికీ, అక్కడ ప్రజలు తమ సమస్యలపై వారిని గట్టిగా నిలదీస్తుండటంతో చాలామంది ఈ గడప గడపకి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం లేదు.

ఇప్పటికే ఈ కార్యక్రమంపై రెండుమూడుసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరోసారి నివేదికలు ముందుపెట్టుకొని మరీ వారితో సమావేశమయ్యి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇంతగా చెపుతున్నప్పటికీ 32 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో చాలా తక్కువగా లేదా అసలు పాల్గొనలేదని తనకి నివేదికలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఫిభ్రవరిలో మరోసారి ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని అప్పటికీ ఆ 32 మంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో టికెట్‌ ఇవ్వడం కుదరదని సిఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కనుక ఇదే చివరి అవకాశంగా భావించి గడప గడపకి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలలోకి వెళ్ళాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సిఎం జగన్‌ వారిపై ఒత్తిడి తెస్తున్నా వారు ఆయనకి భయపడి తాము ఎందుకు పాల్గొనలేకపోతున్నామో ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఒకవేళ వారు చెప్పలేకపోతే ఎందుకు పాల్గొనలేకపోతున్నారో సిఎం జగన్‌ అడిగి తెలుసుకొని ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాలి లేదా వారికి తోడ్పడేందుకు ఎవరినైనా నియమించాలి. కానీ “నేను బటన్ నొక్కుతుంటాను కానీ మీరెందుకు జనం మద్య తిరగరు?” అంటూ నిలదీస్తుండటంతో ప్రతీ సమీక్షా సమావేశంలో ఇదే సీన్ పునరావృతమవుతోంది.