YS Jagan warning to opposition partyఏపీ అసెంబ్లీలో వడ్డీ లేని రుణాలపై సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ పథకాన్ని చంద్రబాబు అటకెక్కించారు అని ముఖ్యమంత్రి జగన్ నిన్న అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. కాదని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అనగా తమ మాట నిజమని తేలితే చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాలు విసిరారు. అయితే ఈరోజు ఆ పథకం అమలు అయినట్టు టీడీపీ అధికారిక లెక్కలు బయటపెట్టడంతో ప్రభుత్వం ఇరుకున పడింది.

ఇవ్వాల్సిందానిలో 5% మాత్రమే ఇచ్చారని కవర్ చేసుకునే ప్రయత్నం జరిగింది. ప్రతిపక్షం దీని మీద ఇరుకున పెడుతుంటే ముఖ్యమంత్రి సహనం కోల్పోయారు. ” మీ మాదిరిగా నేను కామెంట్స్ చేయడం మొదలుపెడితే.. మీరు చేసినట్లే నేను కూడా చేయడం మొదలుపెడితే (ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై).. ఒక్కసారి మేం డిసైడ్ చేస్తే మేం 151 ఎమ్మెల్యేలు ఉన్నాం.. మీ వాళ్లు 23 మంది మాత్రమే ఉన్నారు.. మేం తలుచుకుంటే అసెంబ్లీలో ఎవరూ కనిపించరు అధ్యక్షా,” అని ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి వార్నింగ్ ఇచ్చారు.

“ఎలాంటోళ్లను తయారు చేశారయ్యా.. మీరు.. మొత్తం రౌడీలను, గూండాలను తీసుకొచ్చారు” అని టీడీపీ సభ్యులు, అధినేతపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు సభను ముఖ్యమంత్రి తప్పుదారి పట్టించారని సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది టీడీపీ. సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సభను కొంత సేపు వాయిదా వేశారు. దీనితో 11 గంటలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ 12.22 నిముషాలకు వాయిదా పడింది.