YS Jagan movie tickets Tollywood industry AP

ఏపీ ఆర్ధికంగా దివాళా తీసింది, బయటపడే మార్గం కనపడడం లేదు – వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.

80 వేల కోట్ల చెల్లింపులు ఏపీ ప్రభుత్వం నుండి బకాయిలు ఉన్నాయి – కాంట్రాక్టర్లు

పీఆర్సీ సహా సీపీఎస్ రద్దు చేయాలని గగ్గోలు – ప్రభుత్వ ఉద్యోగులు

దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, మరి ఏపీ రాజధాని – ???

స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్ – పట్టించుకున్న నాధులేరీ?

ఏపీకి సంజీవని అయిన పోలవరం మాటేంటి – రెండున్నర్రేళ్ళల్లో 2% వర్క్?

ఇక సామాన్య ప్రజల దగ్గరికి వస్తే… ఓటీఎస్ పధకం నుండి కరెంట్ బిల్లుల మోత వరకు అన్ని కష్టాలే!

రాష్ట్రంలో ఇన్ని కష్టాలను పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి ప్రస్తుతం దేని పైన ఉంది? అంటే… త్వరలో రిలీజ్ కాబోయే సినిమాల పైన! ఓ వ్యక్తి రాజకీయంగా తనకు ఎదురొడ్డి ప్రశ్నించారన్న ఓపెనింగ్ షాట్ తో మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియని అయోమయ స్థితిలో రచయితలు ఉన్నారు. ఓపెనింగ్ షాట్ “వకీల్ సాబ్”తో మొదలైంది గానీ, ‘శుభంకార్డు’ అగమ్య గోచరంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న కధలోకి వెళితే…

మంగళవారం హైకోర్టు కొట్టివేసిన జీవో నెంబర్ 35 తర్వాత ఏపీలో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ సర్కార్ దాఖలు చేయగా, అది గురువారం ఉదయం విచారణకు రాబోతోంది. ‘లంచ్ మోషన్ పిటిషన్’ ఎక్కువగా ప్రజా ప్రయోజనాలకు అత్యవసర సమయాలలో మాత్రమే దాఖలు చేస్తారన్నది జగమెరిగిన విషయమే!

ఏపీ సర్కార్ కు సినిమాల కంటే అత్యవసరం ఇంకేమి లేదని పరోక్షంగా ఈ ‘లంచ్ మోషన్ పిటిషన్’ ద్వారా చెప్పకనే చెప్పారా? కధ ఇక్కడితో ఆగలేదు. రాష్ట్రంలోని అన్ని ధియేటర్లలో టికెట్ ధరలు, కాంటీన్ లో అమ్ముతోన్న ధరలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు మరియు కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా శానిటైజేషన్ సరిగా జరుగుతోందా? లేదా? అని చెక్ చేయాల్సిందిగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇందులో ఏ ఒక్క అంశంలో అయినా లోపాలు ఉంటే, ఆ ధియేటర్లపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డర్స్ వెళ్లాయి. స్టోరీ ఇక్కడితో అవ్వలేదు, ఇది ఇంటర్వెల్ మాత్రమే! సెకండ్ పార్ట్ లో భాగంగా థియేటర్లకు బి-ఫామ్ లైసెన్స్ ఉందో లేదో జిల్లా వ్యాప్తంగా చెక్ చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాస్త సమయం అటు, ఇటు అయినా గానీ ఇవే ఆదేశాలు ఇతర జిల్లాలకు పాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యుడికి సినిమాను అత్యంత చేరువ చేసేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగం. బహుశా పైన పేర్కొన్న కష్టాలన్నీ అనుభవిస్తోన్న ప్రజలకు అత్యంత తక్కువ ధరలో సినీ వినోదాన్ని పంచి, కష్టాలను కాసేపు అయినా మరిచిపోయేలా చేద్దామనే సదుద్దేశంలో భాగంగా వైసీపీ సర్కార్ ఈ చర్యలను తీసుకుంటుందేమో! ఏపీ ప్రభుత్వం సామాన్యుల కోసం పరితపిస్తూ ఈ స్థాయిలో ఆలోచనలు చేస్తుంటే, మరి ప్రతిపక్షాలు, సినీ వర్గాలు ఎందుకు విమర్శలు చేస్తున్నట్లు?

ఏపీ సర్కార్ అవలంభిస్తోన్న ఈ మార్గం ద్వారా సామాన్యుడు సినిమా ధియేటర్లకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తారా? సినిమా బాగున్నా, లేకున్నా తక్కువ ధర కాబట్టి వెండితెరపై వినోదాన్ని ఆస్వాదించేస్తారా? దేశం అంతా మన వైపే చూసేలా పాలన అందిస్తానని చెప్పిన నాడు అర్ధం కాలేదేమో గానీ, ప్రస్తుతం నిజంగానే దేశం అంతా మన వైపే చూస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలలో “వినోద సమస్య” అత్యంత ప్రాధాన్యమైనదిగా గుర్తించినందుకు!