Jagan Wants Chandrababu To Do That?గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ వివిధ విషయాల మీద కోర్టులకు వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేది. ఇప్పుడు టీడీపీ అధికార పార్టీని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేస్తూ కోర్టుకు వెళ్ళింది. వైఎస్ వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలని టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టుని ఆశ్రయించారు.

ఈరోజు ఆ పిటీషన్ విచారణకు వచ్చింది. కేసులో దర్యాప్తు నివేదికను ఈనెల 23వ తేదీ లోపు సీల్డు కవరులో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసు విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించకుండా సీబీఐతో విచారణ జరపాలని కోరినట్లు బీటెక్ రవి తరఫు న్యాయవాది సల్మాన్ కుర్షిద్ చెప్పారు.

ఈ కేసులో ముఖ్యమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వారికి ప్రమేయం ఉన్నట్టు టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కనుక ఈ కేసు సిబిఐకి వెళ్తే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టొచ్చు అని టీడీపీ భావిస్తుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్, వివేకానంద కుటుంబ సభ్యులు కూడా సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన విషయాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.

90 రోజులు దాటినా ఈ కేసులో ఇంకా చార్జిషీటు దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు పిటినర్ తరపు లాయర్ తెలిపారు. ఈ కేసులో జనవరి 3వ తేదీ నాటికి కౌంటర్ ఆఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేసిస్తూ.. తదుపరి విచారణ వచ్చేనెల జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.