YS jagan Vs Pawan Kalyan Politicsప్రజలకు హైటెక్ యుగం చూపిస్తూ రెండు సార్లు వరుసగా పరిపాలన సాగించి, ‘హ్యాట్రిక్’ కోసం ముందుగా ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబును అడ్డుకున్నది… నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర. అలాగే విభజన జరిగితే ఖచ్చితంగా ఏపీలో అధికారం రావడం ఖాయం అని పరోక్షంగా విభజనకు సహకరించిన జగన్ ను అడ్డుకున్నది… చంద్రబాబు పాదయాత్ర. అంటే ఏపీ జనాలు పాదయాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో రాజకీయ వర్గాలకు అవగతం అయ్యింది. దీంతో 2019 ఎన్నికల నాటికి పాదయాత్ర చేయబోయే పేర్లను పరిశీలిస్తే… ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు వయసు రీత్యా మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశం లేదు. కాంగ్రెస్ నుండి అంతటి సాహాసం చేసే వ్యక్తులు లేరు. చిరంజీవి ఉన్నా లేనట్టే. ఒకవేళ అలాంటి సాహాసం చేసినా కాంగ్రెస్ ను పట్టించుకునే స్థితిలో ప్రజలు లేరు అన్నది స్పష్టం. ఇక రాష్ట్రంలో మిగిలి ఉంది ఇద్దరే… ఒకరు ప్రతిపక్ష నేత జగన్, మరొకరు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు అయితే జగన్ నోట నుండి దీక్షల మాటే తప్ప పాదయాత్ర అన్న ప్రస్తావన రాలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా, త్వరలోనే పాదయాత్ర చేయమని రాజకీయ వ్యూహకర్తగా విచ్చేసిన ప్రశాంత్ కిషోర్ సూచించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితులను గమనిస్తే… వచ్చే ఎన్నికలలో గెలవడం అసాధ్యమని, చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఓటమి పాలవుతారని, వీటన్నింటిని అధిగమించాలంటే… ఓడిపోయే ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నయం ఎంచుకోవాలని, గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలని, అలాగే ఎన్నికల ప్రచారం నాటికి పాదయాత్రను పూర్తి చేయాలని, ఇది కూడా వైఎస్ పాదయాత్రను ప్రజలకు గుర్తు చేసే విధంగా సాగాలని కీలక సూచనలు చేసారని సమాచారం. దీంతో వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా 13 జిల్లాలలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక, జనసేన అధినేత విషయానికి వస్తే… ఇప్పటికే వివిధ సందర్భాలలో పాదయాత్రపై తనకున్న మక్కువను చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను పాదయాత్ర చేయాలని ఉందని, అయితే సినిమాలు చేస్తున్న రీత్యా సమయాభావం వలన చేయలేకపోతున్నానని, ముందుగా అనంతపురం జిల్లాలో మాత్రం ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది చెప్పి కూడా చాలా రోజులు గడిచిపోయింది. అనంతపురం జిల్లాలోనే కాకుండా, సమయాభావం చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాదయాత్ర చేయాలని భావించడం వలనే ఆలస్యమవుతోంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఇద్దరు నేతలు పాదయాత్రలు చేస్తే… ఓట్లు పరంగా ఎలా ఉన్నా, పబ్లిసిటీ పరంగా ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశాలు మాత్రం పవన్ కే ఉన్నాయని చెప్పవచ్చు. జగన్ నిర్వహించే పాదయాత్రలో ఏం చెప్తారు, ఎవరినీ విమర్శిస్తారు అన్న విషయం ఇప్పటికే స్పష్టం. కాబట్టి ఒకటి, రెండు ప్రాంతాలలో మినహా ఇతర చోట్ల జగన్ ప్రసంగాలు హైలైట్ కాకపోవచ్చు. కానీ పవన్ విషయం వేరు. ఎవరిని టార్గెట్ చేస్తారో అన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. కేంద్రంలో బిజెపిని వదలకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం పవన్ వైఖరి ఎలా ఉండబోతుంది? అన్నది ప్రధాన హైలైట్ గా మారనుంది. ఈ విషయంలో పవన్ సక్సెస్ అయితే పాదయాత్ర పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఓట్ల పరంగా ఇది ఎంతవరకు వస్తుందన్నది మాత్రం ప్రశ్నార్ధకమే!