YS Jaganవిశాఖ స్టీల్ ప్లాంట్ మీద వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని, సంస్థలో 100% వాటాలు విక్రయించడానికే కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో నిన్న ప్రకటించారు. దీనితో విశాఖలో ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.

జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది అక్కడ. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ … కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు.

విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులు నినదించారు. అయితే ఈ రగడ వైఎస్సార్ కాంగ్రెస్ మెడకు చుట్టుకునేడట్టు ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఈ తతంగం జరుగుతుందని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పడంతో కార్మికులు, విశాఖ వాసులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకుపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీలంతా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ టీడీపీ ఎంపీలు రాజీనామా చెయ్యాలి డిమాండ్ చేసే వారు. ఇప్పుడు అదే డిమాండ్ జగన్ కు ఎదురవుతుంది. నిజంగా రాజీనామా చేస్తే రిస్క్… అదే సమయంలో బీజేపీ ఆగ్రహానికి కూడా గురికావాల్సి వస్తుంది. దీనితో జగన్ ఇబ్బందిలో పడ్డారనే చెప్పుకోవచ్చు.