ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి, పోలవరం పనులు నిలిచిపోతాయని నాడు చంద్రబాబు నాయుడు చెపితే, “అమరావతే రాజధానిగా ఉంటుంది… అందుకే నేను తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకొంటున్నాను,” అని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో గట్టిగా నొక్కి చెప్పారు. ఆయన తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకోవడంతో రాష్ట్ర ప్రజలు కూడా ఆయన మాటలు నమ్మి వైసీపీకి ఓట్లేసి గెలిపించారు.

కానీ అధికారంలోకి రాగానే ‘మూడు రాజధానులు’ అంటూ మాట మార్చారు. ఆ ప్రతిపాదనని హైకోర్టు తిరస్కరించినప్పటికీ, తమ వైఖరి మారదని వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతున్నారు. రాజధాని అంశంపై ఈ నెల 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. అంటే విశాఖలో రాజధాని ఏర్పాటుకి సుప్రీంకోర్టు ఇంకా గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వలేదన్నమాట!

కానీ “త్వరలో నేను విశాఖకి షిఫ్ట్ అవుతున్నానంటూ…” సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చెప్పేశారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సిఎం జగన్ ఈవిదంగా ప్రకటించడం కోర్టు ధిక్కారమే అని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం చెపుతున్నాయి. అయితే సుప్రీంకోర్టునే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలకి భయపడుతుందనుకోవడం అవివేకమే కదా?

అందుకే విశాఖ నగరంలో సిఎం జగన్ అధికార నివాసం కోసం అధికారులు గాలిస్తున్నారని, రామకృష్ణా బీచ్‌ రోడ్డులో ఉన్న ఓ ఇంటిని దాదాపు ఖరారు చేశారని జోరుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే మార్చి 22 లేదా 23 తేదీలలో సిఎం జగన్‌ విశాఖలో తన అధికారిక నివాసంలో గృహాప్రవేశం చేయవచ్చని తెలుస్తోంది.

సిఎం జగన్‌తో పాటు మంత్రులు కూడా విశాఖ నగరానికి షిఫ్ట్ అయ్యేందుకు వీలుగా సంబందిత శాఖల అధికారులు, సిబ్బంది నగరంలో ఇళ్ళ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ రాజధాని అంటున్నారు కనుక సుప్రీంకోర్టు తీర్పుని బట్టి అవసరమైతే వీలైనంత త్వరగా సచివాలయ సిబ్బంది, వివిద శాఖల అధికారులు, ఉద్యోగులు, వారి కార్యాలయాలని కూడా విశాఖకి తరలించాల్సి ఉంటుంది. కనుక వారందరి కోసం తగిన భవనాల కోసం రహస్యంగా గాలింపు మొదలైన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి కోసం అధికారులు గాలిస్తున్నట్లు వైసీపీ నేతలు మీడియాకి లీకులు ఇస్తూ కధని రక్తి కట్టిస్తున్నారు.

ఆనాడు “తాడేపల్లిలో ఇల్లు కట్టుకొంటున్నాను నన్ను నమ్మండి… అమరావతే రాజధానిగా ఉంటుంది” అని జగన్‌ చెప్పేవారు. ఇప్పుడు “విశాఖకి షిఫ్ట్ అవుతున్నా… మళ్ళీ నన్ను నమ్మండి,” అని జగన్‌ చెపుతున్నారు. జగన్‌ విశాఖకి షిఫ్ట్ అయితే మంచిదే. కానీ ఆయన విశాఖకి షిఫ్ట్ అయినంత మాత్రన్న రాజధాని విశాఖలోనే ఉంటుందని ఆయన గ్యారెంటీ ఇవ్వగలరా?ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని ఉంటుందని విస్పష్టంగా చెపుతోంది కదా?

“మాకు 175 సీట్లు వస్తాయి… రాష్ట్రంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము…” అనే వైసీపీ వాదనలు ఈ ప్రశ్నకి సరైన సమాధానం కాదు. ఇప్పుడు సిఎం జగన్‌ హడావుడిగా విశాఖకి మారినా, కార్యాలయాలని, వాటిలో అధికారులని, ఉద్యోగులని వెంట తెచ్చుకొన్నా ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఇదంతా వృధాయే కదా?విశాఖలోనే రాజధాని ఉంటుందని నూటికి నూరు శాతం నిర్ధారణ కానప్పుడు ఈ హడావుడి దేనికి?అంటే మరోసారి ప్రజలని మభ్యపెట్టి గెలవడానికే అనుకోవాలేమో?