YS_Jagan_vizag_Capitalఈరోజు ఢిల్లీ లీలా ప్యాలస్ హోటల్‌లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “త్వరలో నేను కూడా విశాఖకి షిఫ్ట్ అవుతున్నా. విశాఖ రాజధానిగా అక్కడి నుంచే పాలన సాగుతుంది. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు పలు రాయితీలు ఇస్తోంది. కేవలం 21 రోజులలోనే అన్ని రకాలైన అనుమతులు ఇస్తోంది. వివిద పరిశ్రమలకి తగిన విదంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నాము. కనుక మీరందరూ కూడా విశాఖలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు రావాలని కోరుతున్నాను. మార్చి 3,4 తేదీలలో విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మళ్ళీ కలుద్దాము,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడే విచారణ చేపట్టే అవకాశం ఉంది. సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నమే ఏపీకి రాజధానిగా ఉంటుందని పెట్టుబడిదారులకి చెపుతున్నప్పుడే, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగబోతుండటం బహుశః దేవుడి స్క్రిప్ట్ అనిపించకమానదు. ఒకవేళ అనివార్య కారణాల వలన ఈ కేసుపై నేడు విచారణ జరుపలేకపోతే రేపు విచారణ చేపట్టవచ్చు లేదా వాయిదా వేయవచ్చు.

రాజధాని అంశంపై సుప్రీంకోర్టు తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందనే నమ్మకంతోనే సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా ఉంటుందని, తాను అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పుకొని ఉండవచ్చు. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టునే సమర్ధిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని తీర్పు చెపితే?మార్చిలో విశాఖలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులకి ఏమని చెపుతారు?

ఒకవేళ సుప్రీంకోర్టు విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా, ఒకవేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే మళ్ళీ అమరావతి రాజధాని అవుతుంది. కనుక ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకి ఎన్ని రాయితీలు ఇస్తున్నా రాజధాని ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా తెలియని పరిస్థితులలో ఎవరు మాత్రం వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సాహసిస్తారు?పైగా వేసవి కాలం వస్తే మళ్ళీ పరిశ్రమలకి విద్యుత్‌ కోతలు విధించే అవకాశం కూడా ఉంది. కనుక ముందుగా ఈ సమస్యలని పరిష్కరించుకొంటే మంచిదేమో?