Ys Jagan visited konaseema flood victimsపోలవరం ముంపు మండలాలు చింతూరు, వేలేరుపాడులో సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం పర్యటించి వరద బాధిత ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ గ్రామాలకి వస్తే తమకు ఏదైనా మేలు జరుగవచ్చని ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రజలకు జగన్ మాటలు, ఆశీర్వాదాలు తప్ప మరేమీ లభించలేదు.

జగన్ వచ్చారు… నెత్తి మీద చేయి పెట్టారు… నోటి నిండా కబుర్లు చెప్పారు… ఫోటోలు దిగారు… వెళ్ళిపోయారని వరద బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతలే నయం… తమను పరామర్శించడానికి వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులైనా తెచ్చి ఇచ్చి ఆదుకొంటారని అనుకొన్నారు.

ఇంతకీ జగనన్న ఏం చెప్పారో టూకీగా… “మీకు సాయం చేయాలనే ఉంది కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఒక వెయ్యో రెండువేల కోట్లో అయితే ఇవ్వగలను కానీ 20 వేల కోట్లు ఇవ్వలేను. కేంద్రం ఇస్తేనే నేను ఇవ్వగలను. డబ్బు ఇమ్మనమని కేంద్రానికి లేఖలు వ్రాస్తూనే ఉన్నాను. నోట్లు ముద్రించే కేంద్రం వద్ద కూడా డబ్బు లేదట. ఒకవేళ మీకు నష్టపరిహారం ఇవ్వలేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయినా దానిలో నీళ్ళు నింపను. మీకు పూర్తిగా డబ్బులు చెల్లించాకనే నింపుతాను. కేంద్రం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు మీకు ఇస్తా. అంతవరకు ఓపిక పట్టండి.”

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే చెపుతూనే ఉన్నారు. ఎప్పటికీ పూర్తవుతుందో తెలీని ఆ ప్రాజెక్టులో నీళ్ళు నింపబోమని జగన్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపైకి నెడుతుండటం అతితెలివే అనుకోవాలి. కేంద్రం డబ్బు ఇవ్వదు.. ఆ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తికాదు కనుక నిర్వాసితులు అక్కడే స్థిరనివాసాలు ఏర్పరచుకోవచ్చు అని అనుకొని సరిబెట్టుకోవాలేమో?