YS_Jagan_Visakhaptnam_Capitalమంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి “త్వరలో నేను కూడా విశాఖకి షిఫ్ట్ అవుతున్నాను. విశాఖ రాజధానిగా పాలన సాగుతుంది,” అని చెప్పడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు మండిపడ్డారు.

విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం రూ.2,500 కోట్లు ఇచ్చింది. మరో రూ.4,000 కోట్లు అప్పులు కూడా ఇప్పించింది. అంత సొమ్ము ఖర్చు చేసి అమరావతిలో నిర్మాణాలు చేపట్టిన తర్వాత, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం విశాఖకి రాజధానిని మారుస్తామంటే ఆ సొమ్మంత వృధా అయిన్నట్లే కదా?రాష్ట్రాభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులతో జరుగదు. పరిశ్రమలు, పెట్టుబడులు రప్పించి, విద్యా, వైద్యం, మౌలికవసతులని కల్పిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప మూడు రాజధానులతో కాదు. కనుక జగన్‌ ప్రభుత్వం ఇప్పటికైనా మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మంచిది. అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇదే మా పార్టీ విధానం అని అన్నారు.

బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు మాట్లాడుతూ, “ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో రాజధాని ఉంటుందని, అక్కడికి తాను షిఫ్ట్ అవుతున్నానని ఏవిదంగా చెప్పారు? ఇది సుప్రీంకోర్టుని అపహాస్యం చేసిన్నట్లే కదా?” అని ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్‌ విశాఖకి షిఫ్ట్ అయితే ఆయన ఇంటి అడ్రస్ మారుతుందే తప్ప రాజధాని మారదు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది,” అని అన్నారు.

టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ, “వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో దానిపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే విశాఖ రాజధాని అని మళ్ళీ హడావుడి చేస్తున్నారు. అయినా జగన్‌ ప్రభుత్వమే కదా హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది?మరి ఆ కేసుని సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు విశాఖ రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్‌ ఎలా చెపుతారు?ఇది కోర్టు ధిక్కారం కాదా?” అని ప్రశ్నించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో “ఏపీకి రాజధాని ఏది?” అని ఎవరైనా ప్రశ్నిస్తే అవమానకరంగా ఉంటుంది కనుకనే సిఎం జగన్మోహన్ రెడ్డి ఈవిదంగా మాట్లాడి ఉండవచ్చు. కానీ “రాష్ట్రంలో ప్రభుత్వం మారితే రాజధాని విశాఖలోనే ఉంటుందా?”అని ఎవరైనా ప్రశ్నిస్తే జగన్‌ సమాధానం చెప్పగలరా?