ys jagan very serious

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేయడంపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో సిఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి, ఒంగోలు పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. సిఎం జగన్ ఆదేశాల మేరకు సీఎంవో బాధితురాలికి రూ.10 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సీఐ, ఎసైలను సస్పెండ్ చేస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమీషనర్‌ ప్రకటించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కూడా వెంటనే స్పందిస్తూ, ముందుగా దీనికి బాధ్యులైన ఆస్పత్రి సిబ్బందిని విధులలో నుంచి తొలగించమని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఆస్పత్రికి సెక్యూరిటీ సేవలు అందిస్తున ఏజన్సీని, నిందితులు పని చేస్తున్న ఫాగింగ్ ఏజన్సీలను తొలగిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపి నివేదిక దర్యాప్తు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించారు ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై సాంహూక అత్యాచారం జరిగితే అందుకు ఎవరైనా బాధపడతారు. కానీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బాధితురాలిని పరామర్శించడానికి వచ్చినా కోపం వచ్చేస్తోంది. ప్రతిపక్షాలు నిలదీస్తుంటే హుందాగా జరిగిన పొరపాటును ఒప్పుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని చెప్పకపోగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిపై ఎదురుదాడి చేసి తప్పును కప్పి పుచ్చుకొనే ప్రయత్నం చేస్తుండటం చాలా బాధాకరం.