YS Jagan -venezuela-andhra pradeshఅక్కడెక్కడో నార్తర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో ఉన్న వెనిజులాకు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏంటి? అంటే నేరుగా ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు గానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన పరిస్థితులు గతంలో వెనిజులాలో ఏర్పడిన పరిస్థితులకు సరిపోలుతున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

2014కు ముందు వరకు ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలలో వెనిజులా ఒకటి. కానీ ప్రస్తుతం ఆ దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ దుస్థితికి కారణం ఒక రాజకీయ నాయకుడు తీసుకున్న స్వార్ధపూరితమైన నిర్ణయాలు. చావెజ్ అనే నాయకుడు తాను ఎన్నికలలో గెలవడం కోసం ప్రజలకు అన్ని ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేసారు, దానికి తగ్గట్లే అధికారంలోకి వచ్చారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఉచితంగా పంపిణీ చేసారు. దీంతో రైతులతో సహా ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రభుత్వం ఇచ్చే డబ్బుపై ఆధారపడడం అలవాటు చేసుకున్నారు. నాయకుడిగా చావెజ్ పాపులారిటీ పెరిగింది, ప్రభుత్వం ఇస్తోన్న పథకాలతో ప్రైవేట్ వ్యాపారాలు మూతపడ్డాయి.

ప్రజలు కష్టపడకుండానే చేతి నిండా డబ్బు ఉండేది. కానీ 2013లో చావెజ్ మరణించడం, అలాగే ఆ దేశానికి ప్రధాన ఆదాయవనరి అయిన క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో, సీన్ రివర్స్ అయ్యింది. దేశానికి ఆదాయం పడిపోయింది, సంక్షేమ కార్యక్రమాలు, జీతాలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వంపై ఆధారపడిన ప్రజలు నిస్సహాయులుగా మారిపోయారు.

పొరుగు దేశాల నుండి ఆహరం తెప్పించడానికి కూడా ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు. ఈ దుర్భర స్థితిలో నడుమ ప్రజలు ఒకరినొకరు దోచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే దిశలో పయనిస్తోందన్నది ఓ హెచ్చరికగా ఈ కధనం ప్రసారం చేసారు. ఏపీకి సరిపోల్చే విధంగా ఉండడంతో, సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.

ప్రతి ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా గత వెనిజులా పాలననే చేస్తున్నారన్న హెచ్చరికలు వినపడుతున్నాయి. అభివృద్ధి – సంక్షేమం ఒకే తాటిపై నడిస్తేనే ఏ రాష్ట్రమైనా, దేశమైనా పురోగతి సాధిస్తుంది. ప్రజల స్వశక్తిని పెంపొందించాల్సింది పోయి, వారిని ప్రభుత్వం పైన ఆధారపడేలా చేస్తున్నారనేది కీలక అంశం.

అయితే వెనిజులాకు, ఆంధ్రప్రదేశ్ కు ఓ వ్యత్యాసం ఉంది. వెనిజులాలో ప్రభుత్వ నిధులను పంచి పెట్టగా, ఏపీలో మాత్రం అప్పులు తీసుకువచ్చి మరీ పంపకాలు చేస్తున్నారు. ఈ అప్పంతా మళ్ళీ పన్నుల రూపంలో ప్రజల పైనే పడుతోందన్న విషయాన్ని గమనించుకోవాలి. సరే పన్నులు కట్టడానికి ప్రజల దగ్గర ఆదాయం లేదు, ఎందుకంటే కొత్త ఉద్యోగాలు రాలేదు.

గతంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు కూడా జగన్ రెడ్డి పాలనకు వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి. వెనిజులా ఏపీ కన్నా రెండు రెట్లు చిన్న దేశం. అలాంటి చిన్న రాష్ట్రమే ఓ నాయకుడు చేసిన మతి లేని పనులకు ఇప్పటికి కోలుకొని పరిస్థితి నెలకొంది. మరి ఏపీలో కొనసాగుతున్న పాలన వలన ఎన్ని తరాలు ఇబ్బందుల పాలవ్వాలో?