YS Jagan Vahana Mithraవాహనమిత్ర అనే పేరిట ఆంధ్రప్రదేశ్ లో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున 2.48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లు జమ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు చలానా రూపంలో భారీగా వడ్డించే వారు.. మన ప్రభుత్వం వచ్చాక అపరాధ రుసుములు గణనీయంగా తగ్గాయి అని చెప్పుకొచ్చారు.

“గత ప్రభుత్వంలో 2015-16లో ఆటో నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016-17లో రూ.9.68 కోట్లు. 2017-18లో రూ.10.19 కోట్లు, 2018-19లో రూ.7.09 కోట్లు వసూలు చేసింది. మన ప్రభుత్వంలో 2019-20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు మాత్రమే. 2020-21లో రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు,” అని చెప్పుకొచ్చారు.

చలాన్లు తగ్గడానికి రెండు రకాల కారణాలు ఉండవచ్చు. ఒకటి నిర్లక్ష్యంగా నడపడం తగ్గి ఉండవచ్చు. ఆ తగ్గడం లాక్ డౌన్ కారణంగా బయటకు రాలేకపోవడం వల్ల కావొచ్చు లేదా డ్రైవర్లలో క్రమశిక్షణ పెరిగి ఉండవచ్చు. క్రమశిక్షణ పెరగడానికి చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి లాక్ డౌన్ ప్రభావం కావొచ్చు. లాక్ డౌన్ వల్ల అయితే అందులో ప్రభుత్వ ఖ్యాతి ఏముంది?

లేదా తప్పులు జరుగుతున్నా పోలీసులు చలాన్లు వెయ్యడం మానేశారేమో. ఒకవేళ అదే చేస్తే ప్రజల ప్రాణాలతో ఓట్ల కోసం చెలగాటమాడినట్టే కదా? దాని గురించి ముఖ్యమంత్రి గొప్ప చెప్పుకుంటున్నారా? ఓటు బ్యాంకు రాజకీయాలలో పడి ఒక్కోసారి నాయకులు కూడా కొన్ని కొన్ని మర్చిపోతారేమో!