Jagan Will Pay Price for this Arroganceవారం రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళగానే రాష్ట్రంలో పాలన అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రులు ఎవరికీ వారే కీలకమైన విషయాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిని అమరావతి నుండి తరలించడం దాదాపుగా ఖాయమన్నట్టుగా వ్యాఖ్యానించారు. అది తీవ్ర దుమారం లేపి ప్రతిపక్షాల నుండి విమర్శలు రప్పిస్తుంది.

అసలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఆ విషయంపై బాహాటంగా మాట్లాడలేదు. అయితే బొత్స మాత్రం ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని తొందరలో ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పుకొచ్చారు. ఈ వివాదం ఎంత కీలకమైనది అంటే బొత్స వ్యాఖ్యలు సాక్షి పత్రిక కూడా బ్లాక్ అవుట్ చేసింది. ఆ తరువాత ఇంతవరకు తీసుకోని నిర్ణయంపై చర్చ అనవసరమని విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని కొంత సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు నిన్న.

ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని ఐటీ మంత్రి గౌతంరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ చెప్పిందే బొత్స చెప్పారని పేర్కొన్నారు. ఇదైనా ప్రభుత్వ మాట అంటే అదీ కాదు. క్లుప్తంగా చెప్పాలంటే మంత్రులు ఎవరి అభిప్రాయం వారు ప్రభుత్వ ఉద్దేశం అన్నట్టుగా చెప్పేస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా మంత్రులు అదుపు తప్పుతున్నారా? అనే అనుమానం రాకమానదు.