YS Jagan - Narendra Modiఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ సంచలనమైన విజయం నమోదు చేసింది. 175 ఎమ్మెల్యే సీట్లలో 151 సీట్లలో, 25 ఎంపీ సీట్లలో 22 కైవసం చేసుకుని సంచలన నమోదు చేసుకుంది. 22 ఎంపీ సీట్లతో బీజేపీ, కాంగ్రెస్ తరువాత పార్లమెంట్ లో మూడవ అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ అవతరించింది. నిన్న ఒక టీవీ ఛానల్ తో జగన్ మాట్లాడుతూ ఈరోజు నరేంద్ర మోడీకి వచ్చిన అఖండ మెజారిటీ కారణంగా ప్రత్యేక హోదా అంత తేలిక కాదని, అయినా తమ వైపు నుండి ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు,

కొత్తగా ఎన్నికైన ఎంపీలతో మాట్లాడుతూ… అవసరమైతే రాజీనామాలకు అయినా సిద్ధం కావాలని చెప్పినట్టు కొన్ని పేపర్లు రాశాయి. మొదటి సమావేశంలోనే రాజీనామాలు అనడంతో వారు విస్తు పోయారట. అయితే ఇప్పటి పరిస్థితులలో రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో అర్ధం కాని పరిస్థితి. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. దేశం మొత్తం జయించిన నరేంద్ర మోడీకి ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేదీ పోయేదీ ఏమీ లేదు. జగన్ తన ఎంపీలతో రాజీనామా చేయించినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు.

అదే విధంగా బీజేపీ ఇప్పుడు లోక్ సభలోనూ, రాజ్యసభలోనూ తిరుగులేని మెజారిటీ ఉంది. పార్లమెంట్ లో తమ అవసరాల కోసం ఏ పార్టీ వైపు చూసే అవసరం లేదు. ఏ రకంగా చూసుకున్నా ప్రత్యేక హోదా అనే అంశానికి ఇది గడ్డు కాలమే. అప్పుడు చంద్రబాబు ఎటువంటి సంకటస్థితిలో ఉన్నారో ఇప్పుడు జగన్ కూడా ఈ విషయంలో అదే స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది రెండేళ్ల కాలంలో పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది.