YS Jagan - seriousనిన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటుచేసిన 500 పడకల తాత్కాలిక కొవిడ్‌ ఆస్పత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌ గా ప్రారంభించారు. రికార్డు సమయంలో 500 పడకల తాత్కాలిక కొవిడ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశాం అంటూ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది.

అయితే ఆ తరువాత ప్రారంభం రోజే కురిసిన వర్షానికి ఆసుపత్రి నీట మునిగింది అది వేరే విషయం. మరోవైపు… ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును సీఎం పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన పనితీరును అభినందించారు. అయితే సాయంత్రానికి ఆయనను అనూహ్యంగా బదిలీ చెయ్యడం గమనార్హం.

జిల్లా కలెక్టర్‌గా గంధం చంద్రుడు 2019 డిసెంబరు 2న బాధ్యతలు చేపట్టారు. 18 నెలలపాటు ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనే ఆయన పాలనంతా సాగింది. ఈ నేపథ్యంలో ఉన్నఫలంగా కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన గ్రామ, సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకరకంగా ఇది అంతగా ప్రాధాన్యత లేని పదవి అనే చెప్పుకోవాలి. పొగిడి పన్నెండు గంటలు కూడా కాకుండానే అధికారిని బదిలీ చెయ్యడం పై అధికార వర్గాలలోనూ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా జగన్ మాటలకు, చేతలకు అర్ధాలే వేరులే అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.