YS Jagan to form new districts in andhra pradeshఎన్నికలలో చేసిన వాగ్దానాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనిఎన్నికల ప్రచారం సమయంలో జగన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే జగన్ ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించామని అధికారులను ఆదేశించారు. తాజగా ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ తో కూడా చర్చలు జరిపారని కథనం.

జిల్లాల పునర్విభజన పాలనలో కొత్త ఒరవడికి, వికేంద్రీకృత సేవలకు ఉపకరిస్తుందని పేర్కొన్నారని.. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత దగ్గర చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారని మీడియాలో కథనం. అన్ని ఏర్పాట్లు చేసుకుని గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరున వీటి ప్రారంభోత్సవం జరుగుతుందని భావిస్తున్నారు. కొత్త జిల్లాలు అంటే ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొత్త జిల్లాలలో చాలా ప్రభుత్వ భవనాలు నిర్మించాల్సి ఉంటుంది.

అలాగే అధికారుల కొరత కూడా ఉంటుంది. అందుకే దాని జోలికి గత ప్రభుత్వం వెళ్ళలేదు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాకా పలుజిల్లాలలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. దానితో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడింది. దీనితో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే రియల్ ఎస్టేట్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దానితో ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన అనేక స్కీంలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని జగన్ ఆంచనా.