YS-Jagan and KCRతెలంగాణలో కొత్త సచివాలయం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కల. దానిని ఇప్పటిదాకా ఏపీ భవనాలు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు. అయితే ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పడక ముందే భవనాలు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసేసుకున్నారు. మొదటి కేబినెట్ భేటీ జరగకముందే భవనాల్లోని సామగ్రి, కంప్యూటర్లు, దస్త్రాల తరలింపు ప్రారంభమైంది. మూడు నాలుగు రోజులలో భవనాల అప్పగింత కూడా పూర్తి అవుతుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జగన్ కు తెరాస నుండి విశేషమైన సపోర్టు అందింది.

దీనికి ప్రతిఫలంగానే ఈ భవనాలు ఇచ్చేశారని జగన్ పై ఆరోపణలు వచ్చాయి. వీటిని అడ్డు పెట్టుకుని మిగతా సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చేయడం ఏంటి అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ కు మరో నజరానా ఇవ్వడానికి జగన్ సిద్ధం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. కరెంట్‌ బకాయిలపై తెలంగాణ డిస్కమ్‌లను దివాలా తీసినట్లుగా ప్రకటించి, బకాయిలను వసూలు చేసి ఇవ్వాలని ఏపీ విద్యుత్తు సంస్థలు ఎన్‌సీఎల్‌టీలో కేసు వేశాయి.

ఈ కేసులో రెండు రాష్ట్రాల విద్యుత్తు సంస్థల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ‘మీరంటే మీరే మాకు బాకీ’ అంటూ రెండు రాష్ట్రాల సంస్థలు ఆరోపణలకు దిగాయి. ఇప్పుడు ఆ కేసు ఎత్తివేసి తక్కువ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చి ఈ వివాదాన్ని ముగించే అవకాశం ఉందని తెలుగుదేశం పక్షాలు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నాయి. దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదే జరిగితే జగన్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉంది.