ys jagan three capitals issueమౌలిక వసతులతో ఉన్న విశాఖను రాజధానిగా ఎంపిక చేసుకుని పరిపాలన సాగిస్తామని ఇప్పటికే ఓ సారి స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పి, కొత్తగా రాజధాని నిర్మాణం తమ వల్ల అయ్యే పని కాదని సుస్పష్టంగా తెలియజేసారు. అయితే ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పుతో, ప్రభుత్వ కార్యాచరణలో పూర్తి మార్పులు తీసుకురాగా, తాజాగా రాజధాని విషయమై హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కోర్టు చెప్పినట్లుగా ఒక నెలలో మౌలిక వసతి సదుపాయాలు చేయడం సాధ్యం కాదని, ఈ నిబంధనను పూర్తిగా తీసివేయాలని లేదంటే కనీసం మరో 60 నెలల సమయం (అంటే మరో అయిదేళ్ల పాలన) కావాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. అంతేకాదు, ఆచరణకు సాధ్యం కాని అంశాలు కూడా ఉన్నాయని పరోక్షంగా రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ ఆలోచనలను ఈ అఫిడవిట్ ద్వారా చెప్పకనే చెప్పారు.

అయితే అసలు వైసీపీ సర్కార్ కు రాజధాని నిర్మాణం పట్ల చిత్తశుద్ధి లేదని, హైకోర్టు చెప్పినట్లు మొత్తం పనులు ఒక నెలలో కాకపోయినా, కనీసం కొంత పనైనా ప్రారంభించి ఓ 5 శాతమో, 10 శాతమో పనులు పూర్తి చేసామని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని అడిగితే, అందులో నిజాయితీ, చిత్తశుద్ధి రెండూ కనపడతాయి. అలా కాకుండా అసలు ఆ నిబంధనే తొలగించాలి లేక మరో అయిదేళ్ల సమయం కావాలి అంటే, అది కాలయాపన తప్ప మరొకటి అవుతుందా?

హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుండి శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసే సమయం వరకు, కనీసం 1 శాతం పనులను అయినా వైసీపీ సర్కార్ పూర్తి చేసిందా? అసలు ప్రారంభించిందా? అంటే కాదనే సమాధానమే వెలువడుతుంది. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కార్యదక్షతకు, దార్శనికానికి, పట్టుదలకు అద్దం పట్టే విషయం. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు కూడా ఓ సారి మననం చేసుకోవాలి.

వేల ఎకరాలు సేకరించి, వాటిని విభజించి రోడ్లను నిర్మించి, రైతులకు ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి, ప్రభుత్వ భవనాలను నిర్మించి, మరికొన్ని తుదిదశలో ఉండగా… టీడీపీ సర్కార్ అసలేమీ చేయలేదని, మూడేళ్లు కాలయాపన చేసిందని ఇదే జగన్ రెడ్డి నాడు చేసిన విమర్శలకు, నేడు 60 నెలల సమయం కావాలని అడుగుతున్న దానికి ఎక్కడైనా పొంతన ఉందా? నాడు జగన్ చేసిన విమర్శలను ప్రస్తుతం టీడీపీ తిరిగి వైసీపీకి అప్పచెప్పే పనిలో ఉంది.

కానీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. రాజధాని నిర్మాణం అనేది ఆగిపోవడంతో, మరలా ‘సున్నా’ నుండి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడేళ్లు అటకెక్కగా, మిగిలిన రెండేళ్లు కూడా తాము చేసేదేమి లేదని, 60 నెలల సమయం అడిగినపుడే అర్ధం చేసుకోవాలి. రాజధాని అభివృద్ధిపై దృష్టి పెడితే, ప్రభుత్వం చేపట్టాల్సిన ఇతర కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందని చెప్పడం జగన్ సర్కార్ వివేకానికి నిదర్శనంగా నిలుస్తోంది.