YS Jagan three capital Bill in AP Assemblyఈరోజు రాజధాని అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సిఎం జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ (డీసెంట్రలైజేషన్‌)కు సరికొత్త భాష్యం చెప్పారు. “రోజూ ఉదయాన్నే మీ ఇంటి తలుపు తట్టి చిక్కటి చిర్నవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మీకు సామాజిక పింఛన్ అందిస్తున్నాము. రేషన్ బియ్యం డోర్ డెలివరీ ఇచ్చే విదానం మేము అమలుచేస్తున్నాము. ఇదీ… డీసెంట్రలైజేషన్‌ అంటే. ఇటువంటి ఆలోచన ఏనాడైనా మీ చంద్రబాబు నాయుడుకి వచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల వారు వచ్చి మన రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానం చూసి వారి రాష్ట్రాలలో కూడా అమలుచేస్తున్నారు,” అని గొప్పగా చెప్పుకొన్నారు.

ఇంటికి పింఛను, రేషన్ బియ్యం అందించడమే అధికార వికేంద్రీకరణ అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం చూసి అందరూ నవ్వుకొంటున్నారు. గతంలో కూడా ప్రజలకు పింఛన్లు అందేవి… రేషన్ దుకాణాలలో బియ్యం అందేవి. వాటిని ఇంటికి తీసుకువచ్చి ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుతో మరికొన్ని లక్షలమందికి రేషన్ బియ్యం, పింఛన్లు అందించవచ్చు.

ప్రభుత్వంలో అనేక శాఖలు, వాటిలో మళ్ళీ అనేక విభాగాలు, లక్షాలాదిమంది ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. ఇన్ని వ్యవస్థలు, ఇంత మంది ఉద్యోగులు ఉండగా వాటికి సమాంతరంగా జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను, వాలటీర్ వ్యవస్థను సృష్టించి పరిపాలనలో గందరగోళం సృష్టిస్తోంది. అంతే కాదు… సచివాలయాల నిర్వహణకు, వాటిలో ఉద్యోగులకు, లక్షలాది మంది వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది.

ఆ రెండు వ్యవస్థలు ప్రజలకు మేలు చేయడం కోసం సృష్టించినవి కావు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాల కల్పన, ప్రజలపై నిఘా పెట్టేందుకే అని మంత్రులే చెప్పుకొంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు సచివాలయాలు, వాలంటీర్లు కీలకపాత్ర పోషించబోతున్నారని ఓ మంత్రి అన్నారంటే అర్దం ఏమిటి?

వైసీపీ రాజకీయ అవసరాల కోసం సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసి, వాటిపై వందల కోట్ల ప్రజాధానం వృధా చేస్తూ, ఇంటికి పింఛన్లు, రేషన్ బియ్యం తెచ్చి ఇస్తున్నాము కదా?అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డి శాసనసభలో గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యవస్థలను సృష్టించి ప్రభుత్వంపై భారం పెంచుకొని అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు చెప్పుకోవడం చూసి జనం నవ్వుకొంటున్నారు.

అసలు అధికార వికేంద్రీకరణ అంటే ఇంటికి పింఛన్లు, బియ్యం తెచ్చి అందివ్వడమా లేక రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమో తెలుసో తెలీదో?ఇదే అధికార వికేంద్రీకరణ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తునందునే రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడి చెరువుల్లా మారినా ప్రభుత్వం పట్టించుకోలేదేమో?వాటి గురించి పొరుగు రాష్ట్రాలు చెప్పుకొని నవ్వుకొంటున్నా చీమ కుట్టినట్లు అనిపించడం లేదేమో? ‘మా శ్రీకాకుళం జిల్లా వెనకబడిపోయిందని సాక్షాత్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొన్ననే చెప్పుకొన్నా వినపడలేదేమో? ఇలాంటి వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అవసరమా?ప్రజలు కూడా ఆలోచించాలి.