YS_Jagan_Thiruvuru_Fee_Reimbursementఏపీ రాజకీయాలలో సంక్షేమ పధకాలు ఓ ‘గేమ్ ఛేంజర్’ అని గట్టిగా నమ్మిన సిఎం జగన్మోహన్ రెడ్డికి కడపతో సహా మూడు రాయలసీమ జిల్లాల ప్రజలు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో షాక్ ఇవ్వడంతో నిర్వేదం ఆవహించిన్నట్లుంది. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యాదీవెన పధకం బటన్ నొక్కుడు కార్యక్రమంలో పాల్గొనప్పుడు, ఆయన ప్రసంగంలో ఆ ఆవేదన, ఆక్రోశం స్పష్టంగా వినిపించాయి.

తాను సంక్షేమ పధకాలతో ప్రజలకు ఎంతో మేలు చేస్తుంటే టిడిపి, జనసేనలు తనను ఒంటరిగా ఎదుర్కోలేక పొత్తులకు వెంపర్లాడుతున్నాయన్నారు. తాను ప్రజలకు మంచి చేయడం లేదని భావిస్తే టిడిపి, జనసేనలు 175 స్థానాలలో ముఖాముఖి ఒంటరిగా తనను ఎదుర్కోవాలని సిఎం జగన్‌ మరోసారి సవాలు విసిరారు.

బోడిగుండుకీ మోకాలుకి మూడేసిన్నట్లు వైసీపీ సంక్షేమ పధకాలకి, ప్రతిపక్షాల పొత్తులకి లింక్ పెట్టడం ఏమిటో అర్దం కాదు. సంక్షేమ పధకాలతో రెండో ఛాన్స్ లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నది ఆయనే కదా? వాటిపై అంతగా నమ్మకమున్నప్పుడు టిడిపి, జనసేనలను ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్ళు విసరడం దేనికి?

అయినా తన పార్టీ ప్రయోజనాల కోసం అప్పులు చేసి మరీ ప్రజాధనంతో పధకాలు అమలుచేస్తూ, ప్రజలకు మేలు చేస్తున్నాను కనుక రాష్ట్రంలో మరెవరూ పోటీ చేయకూడదు. ఒకవేళ చేసినా తాను కోరుకొన్నట్లుగానే ఒంటరిగా పోటీ చేయాలి తప్ప పొత్తులు పెట్టుకోకూడదని, ఒకవేళ ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకొని పోటీ చేసినా ప్రజలు మాత్రం తననే ఎన్నుకోవాలని సిఎం జగన్‌ పదేపదే చెపుతుండటం చాలా విచిత్రంగా ఉంది కదా?దీనిని ఏ రాజ్యాంగం అనుకోవాలో?

అందరూ సినిమాలో హీరోని ఇష్టపడతారే తప్ప విలన్లని కాదని సిఎం జగన్‌ చెప్పుకొన్నారు. ఒకవేళ తానే హీరోనని, సింహాన్ని అని సిఎం జగన్‌ గట్టిగా నమ్ముతున్నట్లయితే ఈ విలన్లని, తోడేళ్ళ గుంపులని చూసి ఇంతగా ఆందోళన చెందడం దేనికి?లైనుగా ఒకరొకరే ఇరగదీసేస్తానని చెప్పుకోవడం గొప్పదనమా?

నిజానికి ఏపీలో వైసీపీతో పొత్తులు పెట్టుకొనేందుకు ఒక్క పార్టీ కూడా లేదు గనుకనే తాను పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని చెప్పుకొంటున్నారని అందరికీ తెలుసు.

నేను ప్రజలకు మంచి చేస్తున్నాను. కనుక ప్రజలని, దేవుడిని నమ్ముకొని ఒంటరి పోరాటం చేస్తున్నానని సిఎం జగన్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నిజంగా తమకు మంచి చేస్తోందని భావిస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలలో కర్నూలు, కడప, పులివెందులలో ప్రజలు ఎందుకు టిడిపికి ఓట్లేసి గెలిపించారు?అయినా తాను అద్భుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నానని నమ్మకమే ఉంటే, ఎలాగూ 175 సీట్లు వైసీపీవేనని చెపుతున్నప్పుడు ఇక ఈ ప్రతిపక్షాల గురించి, వాటి పొత్తుల గురించి ఆలోచించడం దేనికి? అవి పొత్తులు పెట్టుకోకూడదని కోరుకోవడం దేనికి?అంటే ఓటమి భయంతో కావచ్చు. అభద్రతాభావం కావచ్చు. ప్రతీ బటన్ నొక్కుడు సభలో సిఎం జగన్‌ ఇవే మాటలు చెపుతుంటే ఆయనే ప్రజలకు వైసీపీ గెలుపు అసాధ్యమని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుంది.