YS Jagan - Teslaఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్… దానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇచ్చిన రిప్లై… రాజకీయంగా ఎంతో చర్చకు దారి తీసింది. కేటీఆర్ తర్వాత దక్షిణాది నుండి ఇతర రాజకీయ నేతలు కూడా మస్క్ కు రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి దీనిపై ఏ ఒక్కరూ మాట్లాడానికి సాహసించలేదు. దీంతో సహజంగానే వైసీపీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టెస్లా ప్రతినిధులతో సౌలర్ ప్లాంట్ పై చర్చలు జరిపి, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే నారా లోకేష్ కూడా టెస్లా కంపెనీ వారితో చర్చలు జరిపిన విషయాలను తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా వైరల్ చేసారు. తెలుగుదేశం ప్రభుత్వానికి – వైసీపీ సర్కార్ కు నడుమ ఉన్న వ్యత్యాసానికి ఇది నిదర్శనం అంటూ టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

నాడు దేశ విదేశాలు తిరిగి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో తన ప్రయత్నం తాను చేసారు. వాటి ఫలితాలేమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే భాగంగానే టెస్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వీటిపై విమర్శలు చేస్తూ… ‘చంద్రబాబు ప్రభుత్వ డబ్బులతో దేశ విదేశాలలో విహారం చేస్తున్నారని’ తీవ్రంగా మండిపడ్డారు.

నాటి విమర్శలు ఎలా ఉన్నా, నేటి పెట్టుబడుల సంగతి మాట్లాడుకుంటే… ముఖ్యమంత్రిగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని టెస్లా లాంటి ఎన్ని కంపెనీలతో జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరిపారు? అంటే… దానిపై కూడా తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వివరణ ఇస్తున్నారు. అలా విదేశాలకు వెళ్లి చర్చలు జరపాలంటే జగన్ మోహన్ రెడ్డికి ఎలా కుదురుతుందని, తనపై ఉన్న అనేక కేసుల నిమిత్తం జగన్ విదేశాలకు వెళ్లే అవకాశం లేదు గనుక వెళ్ళలేరంటూ చెప్తున్నారు.

దేశం విడిచి వెళ్లాలంటే కోర్టు వద్ద జగన్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విచారణకు హాజరు కావడానికే తన దగ్గర సమయం లేదు, విచారణకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతోన్న జగన్, విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకువస్తానని కోర్టును ఏ విధంగా అడుగుతారని తెలుగు తమ్ముళ్లు జగన్ మోహన్ రెడ్డి పడుతోన్న బాధను వెలిబుచ్చుతున్నారు. అందుకే టెస్లాయే కాదు, ఎంత పెద్ద కంపెనీ వద్దకైనా వెళ్లలేని పరిస్థితిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారనేది అసలు వాస్తవం.

https://twitter.com/SujathTDPKadiri/status/1482944321012006915